బంగారంపై చమురు ధరల ప్రభావం, మద్దతు ధర ఎక్కడంటే?
ఇటీవల పెరుగుతున్న బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా తగ్గాయి. ఎంసీఎక్స్ జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం 0.31 శాతం తగ్గి రూ.45,856 పలికింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం పడింది. గత వారం 10 గ్రాముల బంగారం ధర రూ.47,327 పలికి జీవన కాల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. గత రెండు వారాల్లో బంగారం ధరలు రూ.1600 తగ్గాయి. ఎంసీఎక్స్‌లో కిలో వెండి ధర కూడా 0.2 తగ్గి రూ.42,823 పలికింది.

చమురు ధరల ప్రభావం
నేడు ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చవిచూస్తున్నాయి. డాలర్ ప్రభావం కూడా పసిడిపై ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో గత సెషన్‌లో 1 శాతం పెరిగిన ఔన్స్ బంగారం ధర ఈ రోజు 0.2 శాతం తగ్గి 1,689 డాలర్లు పలికింది. చమురు ధరలు సున్నా కంటే తక్కువ డాలర్లకు పడిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఈక్విటీ మార్కెట్, చమురు కంటే బంగారం సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. దీంతో బంగారం ధరల్లో స్థిరత్వం లేదు.

చమురు ధరల ప్రభావం
అందుకే, ఈ రోజు తొలుత చమురు ధరలు రికార్డ్ కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో బంగారం ధర కాస్త పెరిగింది. పసిడి 0.54 శాతం, వెండి 0.32 శాతం పెరిగింది. బంగారం ధరలకు రూ.45,300 వద్ద ఎంసీఎక్స్‌లో మద్దతు ధర ఉండవచ్చునని నిపుణులు అంచనా వేస్తున్నారు. 45,800కు పైన స్థిరపడవచ్చునని చెబుతున్నారు. ఆ తర్వాత రూ.46,100 నుండి 46,300 మధ్య ఉండవచ్చునని చెబుతున్నారు.

ఇతర లోహాల ధరలు..
మిగతా అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ప్లాటినమ్ 0.6 శాతం పడిపోయి 765.70 డాలర్లు పలికింది. వెండి 1.5 శాతం పడిపోయి 15.14 డాలర్లు పలికింది. కరోనా కేసులు పెరగడం, మేజర్ ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాల బలహీన ఆర్థిక వ్యవస్థ, కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడం వంటి అంశాలు బంగారంపై ప్రభావాన్ని చూపుతాయి. ఇప్పటికే యూఎస్ కాంగ్రెస్ చిన్న వ్యాపారాలు, హాస్పిటల్స్ కోసం 450 బిలియన్ డాలర్లు ప్రకటించింది.


Click it and Unblock the Notifications