బంగారం ధరలు ఈరోజు(శుక్రవారం, 04) పెరిగాయి. వరుసగా మూడు రోజుల పాటు తగ్గిన ధరలు నేటి ప్రారంభ సెషన్‌లో పెరుగుదలను నమోదు చేశాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి 10 గ్రాములు రూ.50,911 పలికింది. వెండి కిలో ఫ్యూచర్ 0.23 శాతం ఎగిసి రూ.67,080 పలికింది. అయినప్పటికీ రూ.51వేల దిగువనే ఉంది. అంతకుముందు సెషన్‌లో పసిడి 0.12 శాతం మేర తగ్గింది. వెండి 2 శాతం తగ్గింది. ఆగస్ట్ 7 నాటి గరిష్ట ధర రూ.56,200తో చూస్తే పసిడి ధరలు ఇప్పటికీ రూ.5000 తక్కువనే ఉంది. గత కొంతకాలంగా పసిడి ధరలు అస్థిరంగా కొనసాగుతున్నప్పటికీ రూ.50 వేల నుండి రూ.53వేల మధ్య తచ్చాడుతున్నాయి.

బంగారం మద్దతు ధర
పసిడి ధరలు రూ.50,500 దిగువకు చేరుకుంటే ఆ తర్వాత రూ.50,000 నుండి రూ.50,000 మధ్యకు కూడా క్షీణించవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్షణ మద్దతు ధర రూ.50,500 నుండి రూ.50,300గా ఉండవచ్చునని అంటున్నారు. బంగారం ధరల కరెక్షన్ ఇంకా ఉంటుందని, కరోనా కేసులు, వ్యాక్సీన్ పైన ఆధారపడి ఇది ఉంటుందని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు 0.4 శాతం పెరిగి ఔన్స్ 1,937.84 డాలర్లు పలికింది. చికాగో ఫెడరల్ రిజర్వ్ మరిన్ని ఆర్థిక ప్యాకేజీ సంకేతాలు ఇచ్చింది. అమెరికా మానిటరీ పాలసీ ఆర్థిక వ్యవస్థ ఊతానికి చర్యలు చేపడతామని తెలిపింది. ఆర్థిక ఊతం కోసం వడ్డీ రేట్లు ఎంతలా తగ్గిస్తే పెట్టుబడులపై ఆ మేరకు ప్రభావం ఉంటుంది. ఇది పసిడిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 1.1 శాతం ఎగిసి ఔన్స్ 26.92 డాలర్లు, ప్లాటినమ్ 0.6 శాతం ఎగిసి 894.97 డాలర్లుకు చేరుకుంది.

హైదరాబాద్‌లో ఉదయం పసిడి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధర క్షీణించింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.400 వరకు పడిపోయి రూ.48,770 పలికింది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.400కు పైగా క్షీణించి రూ.53,200కు దిగి వచ్చింది. వెండి కిలో రూ.1500కు పైగా పడిపోయింది.


Click it and Unblock the Notifications