హైదరాబాద్‍లో బంగారం రూ.52,000 క్రాస్, 3 రోజుల్లో వెండి రూ.6వేలకు పైగా జంప్
బంగారం ధరలు నేడు (జూలై 23, గురువారం) స్థిరంగా ఉన్నాయి. నిన్న రికార్డ్ ధరకు చేరుకున్న తర్వాత దాదాపు అదే ధరతో కొనసాగుతున్నాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.16 శాతం స్వల్పంగా పెరిగి రూ.50,158 వద్ద ట్రేడ్ అయింది. ఎంసీఎక్స్‌లో స్పాట్ గోల్డ్ నిన్న రూ.50,015 ఆల్ టైం హైకి చేరుకుంది. రూ.50,005 వద్ద క్లోజ్ అయింది. నిన్న రికార్డ్ ధర పలికిన కిలో వెండి ధర ఈ రోజు స్వల్పంగా 0.4 శాతం తగ్గి రూ.60,870 పలికింది. ఈ ఏడాది మన దేశంలో బంగారం ధరలు ఏకంగా 28 శాతం పెరిగాయి. కరోనా లాక్ డౌన్, ధరల పెరుగుదల కారణంగా ఫిజికల్ పసిడికి డిమాండ్ తగ్గింది.

నిన్న ముంబై, హైదరాబాద్‌లలో రికార్డ్ ధర
బంగారం ధర ఎంసీఎక్స్‌లో బుధవారం సరికొత్త గరిష్టస్థాయిని తాకింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ.430 పెరిగి రూ.50,920కి చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ.50,490గా ఉంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా పసిడి పరుగులు తీస్తోంది. ముంబైలో 10 గ్రాముల బంగారం రూ.50,181 పలికింది. ఆర్థికరాజధానిలో రూ.50వేల మార్క్ తొలిసారి దాటింది. హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.51,700కు చేరుకుంది. ఓ సమయంలో రూ.800కు పైగా పెరిగి రూ.52,200 మార్క్ చేరుకుంది.

పరుగులు పెడుతున్న వెండి
అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు రికార్డ్‌స్థాయిలో పలుకుతున్నాయి. దీంతో దేశీయంగా ప్రభావం పడుతోంది. రెండు మూడు రోజులుగా పసిడి కంటే వెండి ధర దూసుకెళ్తోంది. వెండి ధర నిన్నటి వరకు రెండు రోజుల్లోనే ఏకంగా రూ.6వేల వరకు పెరిగింది. మూడు రోజుల్లో రూ.8 వేలు ఎగబాకింది. దీంతో ఏకంగా రూ.60వేల మార్క్ దాటింది.

అంతర్జాతీయ మార్కెట్లో...
అంతర్జాతీయ మార్కెట్ న్యూయార్క్ కామెక్స్‌లో ఔన్స్ బంగారం ధర 1,865 డాలర్లు పలికింది. వెండి ఔన్స్ 23 డాలర్లు పలికింది. దీంతో బంగారం తొమ్మిదేళ్ల గరిష్టానికి, వెండి ఏడేళ్ల గరిష్టానికి చేరుకుంది. స్పాట్ గోల్డ్ 0.3 శాతం తగ్గి 1865.84 డాలర్లకు చేరుకుంది. విదేశీ మార్కెట్లో బంగారం ధరలు 2008లో మొదటిసారి వెయ్యి డాలర్లకు చేరుకున్నాయి. ఆ తర్వాత మూడేళ్లలో 2011 సెప్టెంబర్ నాటికి 1921 డాలర్లకు చేరుకుంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో మరోసారి రికార్డులు సృష్టిస్తోంది.

అందుకే పెరుగుతోంది..
కరోనా కారణంగా సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థలకు చేయూత నిచ్చేందుకు మంగళవారం యూరోపియన్ దేశాల నేతలు 750 బిలియన్ యూరోల ప్యాకేజీకి ఆమోదం తెలిపాయి. అమెరికన్లను ఆదుకునేందుకు వాషింగ్టన్ కూడా మరో భారీ ప్యాకేజీ ప్రకటించే అవకాశముందని వార్తలు వచ్చాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో డాలర్ వ్యాల్యూ తగ్గింది. అమెరికా బాండ్ ఈల్డ్స్ నీరసిస్తున్నట్లు చెబుతున్నారు. సావరీన్ ఫండ్స్, ఈటీఎఫ్ తదితర పెట్టుబడి సంస్థల బంగారం కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈటీఎఫ్ గోల్డ్ హోల్డింగ్స్ 28 శాతం పెరిగాయి. భౌతిక బంగారానికి డిమాండ్ తగ్గినప్పటికీ పై వివిధ కారణాల వల్ల పైపైకి వెళ్తోంది.


Click it and Unblock the Notifications