పెరిగిన బంగారం ధరలు: మద్దతు ధర, నిరోధకస్థాయి ఎక్కడ?
బంగారం ధరలు ఈరోజు(సెప్టెంబర్ 7, సోమవారం) పెరిగాయి. ఎంసీఎక్స్‌లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు ప్రారంభ సెషన్‌లో 0.25 శాతం పెరిగి రూ.50,805 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 1.3 శాతం లాభపడి కిలో రూ.68,120 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి 0.1 శాతం తగ్గగా, వెండి 0.8 శాతం క్షీణించింది. నెల రోజుల క్రితం ఆగస్ట్ 7వ తేదీన పసిడి ధర రికార్డ్ ధర రూ.56,200కు చేరుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత రష్యా వ్యాక్సీన్ రాకతో పసిడిపై ఒత్తిడి తగ్గింది. ఆ తర్వాత నుండి బంగారం ధరలు భారీగా తగ్గాయి. అప్పుడప్పుడు స్వల్పంగా పెరుగుతూ, అదేస్థాయిలో తగ్గుతున్నాయి.

రికార్డ్ ధర నుండి రూ.5,400 తగ్గుదల
గత నెలలో పలికిన రికార్డ్ ధర రూ.56,200తో పోలిస్తే పసిడి ధరలు ఇప్పటికీ రూ.5,400కు పైగా తక్కువగా ఉంది. వెండి కిలో రూ.77వేల పైకి చేరుకుంది. రికార్డ్ గరిష్టంతో ఇప్పటికీ రూ.10,000 తక్కువగా ఉంది. బంగారం ధరలు రూ.5వేలకు పైగా తగ్గి, అస్థిరంగా కనిపిస్తున్నప్పటికీ రూ.50వేల నుండి రూ.52వేల మధ్యనే కనిపిస్తుండటంతో రిటైల్ డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది. లాక్ డౌన్ సమయంలో, ఆ తర్వాత క్రమంగా పెరుగుదల నమోదు కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. వ్యాక్సీన్ వచ్చినా తాజా తగ్గుదలతో పోలిస్తే స్వల్పంగా మాత్రమే తగ్గవచ్చునని భావిస్తున్నందున రిటైల్ ఫిజికల్ గోల్డ్‌కు డిమాండ్ పెరుగుతోంది.

అందుకే.. పెరుగుతూ.. తగ్గుతూ
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా 0.2 శాతం పెరిగి ఔన్స్ 1,935.53 డాలర్లు పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.2 శాతం తగ్గి ఔన్స్ 26.84 డాలర్లు, ప్లాటినమ్ ఔన్స్ 0.6 శాతం పెరిగి 900 డాలర్లు పలికింది. గతవారం విడుదలైన పలు ఆర్థిక వ్యవస్థల డేటా చూస్తే ఉత్పత్తి క్రమంగా పెరుగుతోందని, నిరుద్యోగిత రేటు కూడా పుంజుకుంటున్నట్లుగా కనిపిస్తోందని ఇది బంగారంపై ఒత్తిడి తగ్గిస్తోందని చెబుతున్నారు. అయితే నిరుద్యోగిత రేటు ఇంకా ఎక్కువే ఉందని, కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనలు, వ్యాక్సీన్.. ఇవన్నీ కలగలిపి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.

మద్దతు ధర.. నిరోధకస్థాయి
బంగారం ధరలు ఔన్స్ 1900 డాలర్ల నుండి 1910 డాలర్ల వద్ద మద్దతు ఉందని, 1972 నుండి 1984 మధ్య నిరోధకతస్థాయి అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.50,000 నుండి రూ.49,800 మధ్య అంచనా వేస్తున్నారు. నిరోధకస్థాయి రూ.51100-51330.


Click it and Unblock the Notifications