సరికొత్త శిఖరాలకు.. బంగారం@రూ.47,000: ఆ మార్క్ దాటిందంటే ఇక అంతే!
కరోనా మహమ్మారి కారణంగా బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గురువారం 10 గ్రాముల పసిడి రూ.47,000 మార్క్ చేరుకుంది. MCXలో తొలిసారి ఈ గరిష్టాన్ని చేరుకుంది. ఎంసీఎక్స్‌లో జూన్ ఫ్యూచర్స్ రూ.47,095 పలికింది. వెండి ధర కూడా పెరిగింది. మే ఫ్యూచర్ 0.2 శాతం పెరిగి కిలో రూ.44,120కి చేరుకుంది.

అందుకే బంగారం పెరుగుదల
బంగారం ధరల పెరుగుదలకు అంతర్జాతీయ మార్కెట్లు, కరోనా కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వంటి అతి ఖరీదైన లోహాల వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించడమే గమనార్హం. కరోనా నుండి ప్రపంచం ఎప్పుడు కోలుకుంటుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో చేతిలో నగదును ఉంచుకోవడంతో పాటు భద్రత కోసం బంగారంపై ఇన్వెస్ట్ చేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1,717.20 పలికింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి ధర ఔన్స్ 0.6% తగ్గి 15.38 డాలర్లు, ప్లాటినమ్ 1.1 శాతం తగ్గి 770.80 పలికింది. అయితే గోల్డ్ ఫ్యూచర్స్, సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గాయి.

మూడు రోజుల్లో రూ.2,000 వరకు పెరుగుదల
కరోనా వ్యాప్తి నిరోధించేందుకు లాక్ డౌన్‌ను ప్రధాని మోడీ మే 3వ తేదీ వరకు పొడిగించారు. దీంతో మధ్యాహ్నం ఎంసీఎక్స్‌లో 0.83 శాతం లేదా రూ.389 పెరిగి రూ.47,099 పలికింది. అంతకుముందు సెషన్‌లో రూ.46,710 వద్ద ముగిసింది. బంగారం ఈ మూడు రోజుల్లోనే రూ.2000 వరకు పెరిగింది.

2000 డాలర్లకు బంగారం ధర
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ 1720 నుండి 1750 డాలర్ల వరకు ఉంది. ఈ ఏడాది చివరి నాటికి 2,000 డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మన వద్ద ఇది రూ.50,000 మార్క్ కూడా దాటవచ్చునని భావిస్తున్నారు.

ఒక్కసారి ఆ మార్క్ దాటిందంటే..
బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం 1700 డాలర్లకు పైగా ఉందని, ఓసారి కనుక ఇది 1800 డాలర్లకు చేరుకుంటే 1900 డాలర్లకు వేగంగా చేరుకుంటుందని గ్లోబల్ బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇక ఆ తర్వాత 2000 చేరుకోవడానికి సమయం పట్టదని, ఈ లెక్కన ఈ ఏడాది చివరి నాటికి 2000 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications