వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. నేడు (ఏప్రిల్ 15, బుధవారం) కూడా పసిడి ఖరీదుగా మారింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రభావం భారత బులియన్ మార్కెట్ పైన కూడా పడుతోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం వంటి అతి ఖరీదైన లోహాలపై సురక్షిత పెట్టుబడులుగా భావిస్తున్నారు.

రెండు రోజుల్లో రూ.1500 పెరుగుదల
ఎంసీఎక్స్‌లో ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఫ్యూచర్ మార్కెట్లో పసిడి 10 గ్రాములకు రూ.46,700కు చేరుకుంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 1 శాతం పెరిగి రూ.46,785తో సరికొత్త రికార్డులకు చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో 2 శాతం పెరిగి రూ.46,255కు చేరుకుంది. బంగారం ధర రెండు రోజుల్లోనే రూ.1,500 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 1,727.59 డాలర్లకు చేరుకుంది. అంతకుముందు ఏడేళ్ల క్రితం 1,750 డాలర్ల సమీపానికి వచ్చింది. మిగతా అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే ఔన్స్‌కు.. వెండి 1.1 శాతం పడిపోయి 15.64 డాలర్లు, ప్లాటినమ్ 1.1 శాతం పెరిగి 783.25 డాలర్లు పలికింది. బంగారం ధర 2012లో ఔన్స్‌కు 1,746.50 పలికింది. ఇఫ్పుడు ఆ సమీపానికి వచ్చింది.

గోల్డ్ ఈటీఎఫ్‌లోకి పెట్టుబడులు
గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెండ్ ఫండ్ లేదా ETFలు పెట్టుబడుల ప్రవాహాన్ని చూస్తున్నాయి. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రెడెడ్ ఫండ్ SPDR గోల్డ్ ట్రస్ట్ మంగళవారం నాటికి 0.8 శాతం పెరిగి 1,017.59 టన్నులుగా నిలిచింది.

అందుకే అనిశ్చితి
కరోనా మహమ్మారి ఈక్విటీ మార్కెట్లపై భారీ ప్రభావం చూపుతోందని అందుకే చాలామంది పసిడి వైపు చూస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే లాక్ డౌన్ లేదా షట్ డౌన్ కారణంగా బంగారం భౌతిక కొనుగోలుపై ప్రభావం చూపుతోందని, ఈ కారణంగానే స్పాట్ లేదా ఫ్యూచర్ గోల్డ్ అనిశ్చితితో కొనసాగుతోందని చెబుతున్నారు. సప్లై ఇష్యూల ప్రభావం ఫ్యూచర్ కౌంటర్లపై పడవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications