పెరిగిన బంగారం ధర, ఎంతంటే?: అందుకే ఈ వారం తగ్గే ఛాన్స్, ఆస్ట్రేలియాలో యమ డిమాండ్
బంగారం ధరలు ఈ రోజు ఫ్లాట్‌గా ఉన్నాయి. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను మే 17వ తేదీ వరకు పొడిగించడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిని నష్టపోతున్నాయి. అదే సమయంలో క్రమంగా ఆంక్షలు తొలగిస్తుండటంతో బంగారంపై ఒత్తిడి తగ్గుతోంది. దీంతో అతి స్వల్పంగా పెరిగి ఫ్లాట్‌గా ఉంది.

ఫ్లాట్‌గా బంగారం ధర
గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాముల ధర తొలుత రూ.45,529 పలికింది. ఆ తర్వాత గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ స్వల్పంగా పెరిగింది. వెండి కిలో ధర 0.08 శాతం లేదా రూ.35 పెరిగి రూ.41,632 పలికింది. లాక్ డౌన్ కారణంగా స్పాట్ గోల్డ్ మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో ఈ రోజు బంగారం ధర స్వల్పంగా రూ.10 పెరిగి 22 క్యారెట్ల ధర రూ.43,620, 24 క్యారెట్ల ధర రూ.46,420 పలికింది.

ఈ వారం ధరలు ఎలా ఉండవచ్చు
బంగారం ధరలు ఈ వారం అస్థిరంగానే ఉండే అవకాశమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఈ వారం రూ.45,250 వద్దకు చేరుకోవచ్చునని, రూ.45,800కు చేరుకుంటే తిరిగి రూ.46,300 స్థాయికి విస్తరించవచ్చునని అంచనా వేస్తున్నారు. వరుసగా లాక్ డౌన్ ఎత్తివేతలు లేదా ఆంక్షలు తగ్గడం, చమురు ధరలు క్రమంగా కోలుకుండటం వంటి కారణాలు బంగారంపై ఒత్తిడి తగ్గించే అవకాశముందని అంటున్నారు. ధరలు రూ.45,250 కంటే తక్కువకు పడిపోతే మాత్రం మరింత బలహీనపడి మార్కెట్లో రూ.44,800 కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి 1,697.43 డాలర్లుగా ఉంది. ఏప్రిల్ 21వ తేదీ తర్వాత గత శుక్రవారం తొలిసారి 1,668.53కు పడిపోయింది. ఆ తర్వాత పెరిగి, ఇప్పుడు స్వల్పంగా తగ్గింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.3 శాతం పెరిగి ఔన్స్ 1,705.90 డాలర్లు పలికింది. ఇతర ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం 0.7 శాతం పెరిగి 1,912.52 డాలర్లు, ప్లాటినమ్ 0.4 శాతం తగ్గి 757.27 డాలర్లు, వెండి 0.6 శాతం తగ్గి 14.85 పలికింది.

8 ఏళ్లకు గరిష్టానికి బంగారం సేల్స్
ఏప్రిల్ నెలలో బంగారం ధరలు తమ వద్ద దాదాపు ఎనిమిదేళ్లలో తొలిసారి గరిష్టానికి పెరిగాయని ఆస్ట్రేలియాకు చెందిన పెర్త్ మింట్ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ఇన్వెస్టర్లు బంగారం పెట్టుబడి పెట్టేందుకు లేదా బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications