తగ్గిన బంగారం ధర, నెలలో ఎంత పెరిగిందంటే! రిటైల్ బేజారు
గతకొద్ది రోజులుగా మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పెరుగుతున్న పసిడి ధరలు ఈ రోజు మధ్యాహ్నం అతి స్వల్పంగా తగ్గాయి. కరోనా తదనంతర పరిణామాల నేపథ్యంలో గత నాలుగైదు నెలల్లోనే రూ.40వేలు ఉన్న ధరలు ఇప్పుడు రూ.55వేలు దాటాయి. ఈరోజు ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం 0.1% తగ్గి రూ.55840 పలికింది. అంతకుముందు ప్రారంభంలో రూ.56,191 పలికింది. ఆ తర్వాత రూ.300కు పైగా తగ్గింది. వెండి కిలో 0.33 శాతం తగ్గి రూ.75,800 పలికింది. అంతకుముందు రూ.77,950 పలికింది.

నెలలో 14 శాతం పెరుగుదల
గత సెషన్‌లో బంగారం ధరలు 1.3 శాతం లేదా రూ.720 పెరిగాయి. ఈ రోజు ప్రారంభంలోను పెరుగుదల కనిపించింది. ఆ తర్వాత స్వల్పంగా తగ్గాయి. నిన్న వెండి కిలో 5.6 శాతం లేదా రూ.4,100 పెరిగింది. ఈ ఏడాది బంగారం ధరలు 44 శాతం పెరిగాయి. ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు ఈ నెల రోజుల్లో 14 శాతం పెరిగాయి.

మరికొద్ది రోజులు పెరుగుదల
బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్లో 16 రోజులుగా పైపైకి ఎగబాకుతున్నాయి. 24 గ్రాముల పసిడి శుక్రవారం ఢిల్లీలో ఆల్ టైమ్ హై రూ.57,008కి చేరుకుంది. వెండి కిలో రూ.77,840 పలికింది. కరోనా కేసులు పెరగడం, ఆర్థిక అనిశ్చితితో ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపడంతో బులియన్ మార్కెట్లో ఈ వారం బంగారం పదేళ్లలోనే గరిష్టస్థాయిలో లాభపడిందని రాయిటర్స్ పేర్కొంది. మరికొద్దిరోజులు బంగారం, వెండి ధరల పెరుగుదల కొనసాగుతుందని చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో 2,085 డాలర్లు
ఢిల్లీ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఆల్ టైమ్ హై రూ.57,008కి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ఔన్స్ 2,085 డాలర్లకు చేరుకుంది. స్పాట్ గోల్డ్ 0.3 శాతం పెరిగి 2,068.32 డాలర్లు పలికింది. వెండి ఔన్స్ ధర 2.6 శాతం ఎగిసి 30 డాలర్ల సమీపానికి చేరుకుంది.

రిటైల్ ఇన్వెస్టర్లు బేజారు
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు మాత్రమే బంగారంపై పెట్టుబడి పెడుతున్నారు. రిటైల్ మార్కెట్లలో భౌతిక బంగారానికి డిమాండ్ పడిపోయింది. ఇందుకు పెరుగుతున్న ధరలు, చేతిలో నగదు లేకపోవడమే ప్రధాన కారణాలు. కొనుగోలు చేయాలని ఆసక్తి ఉన్నవారు కూడా ధరలను చూసి వెనుకడుకు వేసే పరిస్థితి. దీంతో రిటైల్ మార్కెట్ బోసిపోయింది.
గతవారం చైనాలో టాప్ డీలర్స్ గత వారం రికార్డ్ ధరకు వ్యతిరేకంగా డిస్కౌంట్ పైన ఆఫర్ చేశారట. ప్రస్తుత పరిస్థితుల్లో యువతకు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడంపై ఆసక్తి లేదని చెబుతున్నారు. హాంగ్‌కాంగ్‌లో డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారట. చైనాలో అమ్మకాలు పెరిగాయని, అయితే వెండి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెబుతున్నారు. ఇండియా విషయానికి వస్తే ఎంసీఎక్స్‌లో బంగారం 56 వేలకు చేరుకుంది. ఇక్కడా రిటైలర్లు దెబ్బతింటున్నారు. కొంతమంది ఇన్వెస్టర్లు కాయిన్స్, బార్లు కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి చాలా తక్కువేనని చెబుతున్నారు. ఇండియాలో ప్రీమియం గత వారం ఔన్స్ 8 డాలర్ల నుండి 4 డాలర్లకు తగ్గింది.


Click it and Unblock the Notifications