Gold Prices Today: ఆల్‌టైం గరిష్టం నుండి రూ.5,700 తగ్గిన పసిడి ధర
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు మంగళవారం (అక్టోబర్ 6) క్షీణించాయి. ప్రారంభ సెషన్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.15 శాతం క్షీణించి రూ.50,550 పలికింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.12 శాతం క్షీణించి కిలో రూ.61,868 పలికింది. అంతకుముందు సెషన్‌లో పసిడి ధర 0.1 శాతం పెరిగింది. నిన్న ఓ సమయంలో కనిష్టం రూ.50,030 కూడా పలికింది. చివరకు స్వల్పంగా పెరిగింది. వెండి 1 శాతం ఎగిసింది. ఆగస్ట్ 7న బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం (ఆగస్ట్ 7) పసిడి రూ.56,200 పైన, వెండి రూ.79వేలు పలికిన విషయం తెలిసిందే.

రూ.5,700 తక్కువ..
దాదాపు గత నెల రోజులుగా పసిడి ధరలు ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5వేల నుండి రూ.6వేల వరకు తక్కువ పలుకుతోంది. గత కొద్ది రోజులుగా రూ.49వేల పై నుండి రూ.51వేలకు అటు ఇటుగా కదలాడుతోంది. ఈ రోజు ఆల్ టైమ్ గరిష్టంతో రూ.5,700 వరకు తక్కువగా ఉంది. వెండి ఆల్ టైమ్ గరిష్టంతో రూ.17వేలకు పైగా తక్కువ పలుకుతోంది.

వివిధ నగరాల్లో ధరలు..
బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల పసిడి రూ.500కు పైగా క్షీణించి రూ.52,400 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.48,020 పలికింది. ఢిల్లీలో పసిడి ధరలు రూ.400కు పైగా క్షీణించి 24 క్యారెట్ల ధర రూ.53,350 పలికింది. 22 క్యారెట్ల పసిడి రూ.48,900 పలికింది.

బంగారంపై తగ్గిన ఒత్తిడి
క్రితం సెషన్‌లో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రెండు వారాల గరిష్టం వద్ద ట్రేడ్ అయ్యాయి. చివరకు దాదాపు స్థిరంగా ముగిశాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,912.49 వద్ద ట్రేడింగ్ ముగించింది. ఇది 1,918.36 డాలర్ల వద్ద కూడా ట్రేడ్ అయింది. సెప్టెంబర్ 22 తర్వాత ఇది గరిష్టం. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గతవారం చివరలో కరోనాతో ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత పసిడి ధర పెరిగింది. నిన్న ఆయన తిరిగి వచ్చారు. సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ పెరిగింది. దీంతో బంగారంపై ఒత్తిడి తగ్గింది. ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే వెండి 0.1 శాతం పెరిగి 24.37డాలర్ల వద్ద, ప్లాటినమ్ 0.1 శాతం ఎగిసి 897.99 డాలర్ల వద్ద, పల్లాడియం 0.2 శాతం క్షీణించి 2,356.85 డాలర్లు పలికింది.


Click it and Unblock the Notifications