వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం ధర- ఉద్దీపన ప్యాకేజీతో ఊపు..
వరుసగా మూడు సెషన్ల పాటు నష్టాలతో కుదైలేన బంగారం మార్కెట్లు వరుసగా రెండో రోజు కాస్త కోలుకున్నాయి. విదేశీ మార్కెట్లతో పాటు దేశీయంగా కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ కారణంగా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 244 రూపాయలు పెరిగి 46,230కు చేరుకుంది.

నిలకడగా బంగారం ధరలు..
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశీయంగా జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీ బంగారం మార్కెట్లపై భారీగా కాకున్నా ఓ మోస్తరుగా ప్రభావం చూపింది. వరుసగా మూడు సెషన్ల పాటు నష్టాలను ఎదుర్కొన్న బంగారం మార్కెట్లు.. రెండు సెషన్ల నుంచి కోలుకున్నాయి. వరుసగా రెండో రోజు దేశీయ ప్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇవాళ పది గ్రాముల బంగారం ధర 244 రూపాయల మేర కోలుకుని 46 వేల 230 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.

కనిపించని ఈక్విటీ మార్కెట్ల ప్రభావం...
కేంద్రం ఉద్దీపన ప్యాకేజీ తర్వాత కూడా ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నప్పటికీ ఆ ప్రభావం బంగారం మార్కెట్లపై కనిపించలేదు. నిన్నటి క్లోజింగ్ విలువ 10 గ్రాములకు రూ.45,981గా ఉన్నప్పటికీ ఉదయం తొలి సెషన్లోనే స్వల్ప పెరుగుదల కనిపించింది. తొలి సెషన్ ముగిసేసరికి 10 గ్రాముల బంగారం ధర 185 రూపాయల మేర పెరిగి రూ.46,166 వద్ద ట్రేడ్ అయింది. మధ్యాహ్నం సెషన్లో ఇంకాస్త కోలుకుని 244 పాయింట్ల పెరుగుదల నమోదు చేసుకుంది.

అంతర్జాతీయంగానూ అదే ట్రెండ్..
అంతర్జాతీయంగా ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో నెలకొన్న భయాలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఉద్దీపన ప్యాకేజీల ప్రభావం బంగారం కొనుగోళ్లపై పడుతోంది. నష్టభయం లేని పెట్టుబడిగా జనం బంగారాన్ని భావిస్తున్నట్లు తాజా ట్రెండ్స్ సైతం సూచిస్తున్నాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్దం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమవుతోంది.


Click it and Unblock the Notifications