బంగారం ధర మళ్లీ ఆ మార్క్ దాటవచ్చు! గతవారం ఎంత పెరిగిందంటే
గతవారం బంగారం ధరలు మళ్లీ రూ.50వేల దిగువకు వచ్చాయి. అంతకుముందు వారం రూ.50,000 పైకి చేరిన పసిడి ఇప్పుడు రూ.49,290 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ప్రస్తుతం 1850 డాలర్లకు దిగువన ఉన్నప్పటికీ ఈ వారం 1870 డాలర్లకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. 1900 డాలర్లకు కూడా చేరుకునే అవకాశాలు లేవని అంటున్నారు. అలా అయితే దేశీయ మార్కెట్లో తిరిగి రూ.50వేలు దాటవచ్చునని భావిస్తున్నారు.

వారంలో ఎంత తగ్గిందంటే?
బంగారం ధరలు గతవారం చివరి సెషన్‌లో పెరిగాయి. ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ పది గ్రాములు రూ.213 పెరిగి రూ.49,290 వద్ద ముగిసింది. అంతకుముందు వారం మొత్తంగా పసిడి ధరలు 2.66% మేర పెరిగాయి. గతవారం మాత్రం రూ.50వేల పై నుండి రూ.49,300 దిగువకు వచ్చాయి. అంటే దాదాపు రూ.వెయ్యి వరకు తగ్గింది. ఇక, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.177 పెరిగి రూ.49,330 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ మార్చి రూ.70 పెరిగి కిలో రూ.63,600 వద్ద ముగిసింది. మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.82 తగ్గి రూ.64,514 వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లోను...
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 6.30 (+0.34%) డాలర్లు పెరిగి 1,843.70 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్లో 1,827.25 - 1,851.75 డాలర్ల మధ్య కదలాడింది. ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో ఏడాదిలో పసిడి 22.35 శాతం పెరిగింది.
సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం 0.016 (-0.07%) డాలర్లు తగ్గి 24.078 డాలర్ల వద్ద ముగిసింది. క్రితం సెషన్లో 23.703 - 24.242 డాలర్ల మధ్య కదలాడింది. ఏడాదిలో వెండి ధర 40.16 శాతం పెరిగింది.

నగరాల్లో బంగారం ధరలు..
బహిరంగ బులియన్ మార్కెట్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధరలు రూ.100కు పైగా తగ్గి రూ.52,530గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ.48,150గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం రూ.100కు పైగా పెరిగి రూ.50,180, 22 క్యారెట్ల బంగారం రూ.46,000గా ఉంది.


Click it and Unblock the Notifications