డిస్కౌంట్ నుండి ప్రీమియం వైపు.. వారంలో బంగారం ఎంత పెరిగిందంటే?
బంగారం, వెండి ధరలు నిన్న మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో 10 గ్రాముల పసిడి 2.18 శాతం లాభపడి ఔన్స్ 1,936.40 డాలర్ల వద్ద ముగిసింది. ఔన్స్ వెండి 1.55 శాతం లాభపడి 24.21 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు సెషన్‌లో 1,895.10 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. 1988 నుండి 1936 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో శుక్రవారం డిసెంబర్ ఫ్యూచర్ గోల్డ్ రూ.50,817 వద్ద, వెండి కిలో రూ.62,884 వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.

గోల్డ్ ప్రీమియం..
రిటైల్ బంగారు వ్యాపారులు ఫిజికల్ గోల్డ్‌ను ప్రీమియంలో విక్రయిస్తున్నారు. ఫిజికల్ గోల్డ్‌ను ప్రీమియంతో విక్రయించడం ఆగస్ట్ నుండి ఇదే మొదటిసారి. గత వారం ఔన్స్ 6 డాలర్ల తగ్గింపుతో పోల్చితే డీలర్లు ఇప్పుడు దేశీయ ధరలపై 2 డాలర్ల ప్రీమియం ఛార్జ్ వసూలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బంగారం ధరలు ఆగస్ట్ మొదటివారంలో 10 గ్రాములు రూ.56,200 రికార్డ్ గరిష్టాన్ని తాకిన విషయం తెలిసిందే. గరిష్ట ధరతో ఫ్యూచర్ మార్కెట్లో రూ.5,000కు పైగా తక్కువ పలుకుతోంది. అయితే కరోనా నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు కుదుటపడే వరకు పసిడి ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కొనసాగుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

పండుగ సీజన్ పైన ఆశ
కరోనా కారణంగా ఏడు నెలలుగా పసిడి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఆగస్ట్ నుండి క్షీణిస్తున్నాయి. ఇటీవల తగ్గిన ధరలకు తోడు పండుగ సీజన్ తమకు లాభిస్తుందని రిటైల్ గోల్డ్ వ్యాపారులు ఆశాభావంతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత ఏడాదితో పోలిస్తే 50 శాతం సేల్స్ జరిగినా సంతోషమేనని రిటైల్ వ్యాపారులు భావిస్తున్నారు. ఇప్పటికే బంగారం దుకాణదారులు పండుగ అమ్మకాలు ప్రారంభించారు. గత కొద్ది నెలలుగా బంగారం కొనుగోళ్లు లేవని, ఇప్పుడు పండుగ సమయంలో పుంజుకుంటాయని భావిస్తున్నారని క్యాప్స్ గోల్డ్ ఎండీ ఆశాభావం వ్యక్తం చేశారు.

గతవారం ధరలు ఎంత పెరిగాయంటే?
గతవారం బంగారం ధరలు పెరిగాయి. ఢిల్లీలో గత సోమవారం రూ.51,192 వద్ద ప్రారంభమైన ధర శుక్రవారం నాటికి స్వల్పంగా పెరిగి రూ.51,558 పలికింది. శుక్రవారం రూ.380కి పైగా తగ్గింది. ఇక వెండి ధరలు ఢిల్లీలో కిలో రూ.61,902 వద్ద ప్రారంభమై శుక్రవారం నాటికి రూ.62,400కు చేరుకుంది. బంగారం రూ.350కి పైగా పెరగగా, వెండి రూ.500 వరకు పెరిగింది.


Click it and Unblock the Notifications