వారంలో బంగారం ధరలు ఎంత పెరిగాయంటే? అక్కడ చివర్లో తగ్గాయి
ముంబై: బంగారం ధరలు గతవారం దాదాపు 2% మేర పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం రూ.50,305 వద్ద క్లోజ్ అయింది. గతవారం రూ.49,300కు కాస్త పైన ప్రారంభమైన ధర దాదాపు రూ.1,000 (2 శాతం) ఎగిసి రూ.50,305 వద్ద ముగిసింది. గత వారంలో ఐదు సెషన్‌లలో మూడు సెషన్లు లాభపడింది. ఫ్యూచర్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,900 తక్కువగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం
రిటైల్ బులియన్ మార్కెట్లో బంగారం 0.20 శాతం పెరిగింది. రూపాయి ఫ్లాట్‌గా ముగియడం, బలహీనమైన అంతర్జాతీయ సూచనలతో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దాదాపు నెల రోజుల తర్వాత ప్రీమియం 1 డాలర్ డిస్కౌంట్‌కు దిగి వచ్చింది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,899గా, 24 క్యారెట్ల పసిడి రూ.50,108గా ఉంది. వీటికి జీఎస్టీ అదనం.
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి ధరలు ఓ సమయంలో రూ.50,469కి పెరిగింది. గోల్డ్ ఫ్యూచర్ ఫిబ్రవరి టర్నోవర్ 11,371 లాట్లుగా ఉంది. ఏప్రిల్ బిజినెస్ టర్నోవర్ 1755 లాట్లుగా నమోదయింది.

నిరోధకస్థాయి.. మద్దతు ధర
బంగారం ధరలు ఈ వారం కూడా ప్రస్తుత స్థాయికి కాస్త అటుఇటుగా ట్రేడ్ కావొచ్చునని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఔన్స్ గోల్డ్ ప్యూచర్ నిరోదక స్థాయి1,890/1,910 డాలర్లు, మద్దతు ధర 1,850 డాలర్లు. ఇక, దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నిరోధకస్థాయి రూ.50,800, మద్దతు ధర రూ.49,500.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1881.49 డాలర్ల వద్ద ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్లో డౌన్
క్రితం వారం దేశీయ ఫ్యూచర్ మార్కెట్ MCXలో 10 గ్రాముల ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.85.00 (-0.17%) తగ్గి రూ.50,305 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.50,332 వద్ద స్థిరపడింది. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.67,840 వద్ద, మే ఫ్యూచర్స్ రూ.68,803 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 3.40 (-0.18%) డాలర్లు క్షీణించి 1,887.00 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ క్రితం సెషన్లో 0.178 (-0.68%) క్షీణించి 26.003 వద్ద క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications