పరుగులు పెడుతున్న బంగారం@రూ.50,000: ఆ ధర వద్ద ఆగిపోతే ఓకే.. లేదంటే మరింత జూమ్
బంగారం ధరలు పరుగెడుతున్నాయి. కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుదల, చైనా-భారత్, చైనా - అమెరికా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లు తదితర కారణాలతో బంగారం ధర భారీగా పెరుగుతోంది. సోమవారం భారత వాణిజ్య రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 చేరువకు వెళ్లింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3 శాతం జీఎస్టీతో కలిపి రూ.49,749కి చేరుకుంది.

హైదరాబాద్‌లో రూ.50,000 దాటిన బంగారం
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,580కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.46,290 పలికింది. వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధర రూ.48,800కు చేరుకుంది. అంతర్జాతీయంగా విలువైన లోహాల ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.49,800కు పైగా పలికింది.

రూపాయి బలోపేతంతో కాస్త తగ్గుదల
హైదరాబాద్‌తో పాటు విజయవాడ సహా దశవ్యాప్తంగా పలు స్పాట్ బులియన్ మార్కెట్లలో సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.50,000 దాటినట్లుగా చెబుతున్నారు. ఆ తర్వాత రూపాయి బలోపేతం కావడంతో పసిడి ధర కాస్త దిగి వచ్చింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో బంగారం ఆగస్ట్ ఫ్యూచర్స్ ధర రూ.48,289 వద్ద ట్రేడ్ అయింది. రూపాయి విలువ శుక్రవారంతో పోలిస్తే 17 పైసలు బలపడి 76.03 వద్ద క్లోజ్ అయింది. రూపాయి మళ్లీ పడిపోతే బంగారం ధరలు పెరగొచ్చు.

బంగారం పెరుగుదలకు కారణాలు..
బంగారం ధరలు పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి కేసులు పెరుగుతుండటం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఆర్థిక వ్యవస్థలు కోలుకోవడానికి చాలా కాలం పడుతుందని అమెరికా ఫెడ్ రిజర్వ్ ఉన్నతాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది లోహాల డిమాండ్-ధరపై ప్రభావం చూపింది. బంగారంలో పెట్టుబడి పోర్ట్‌పోలియోను తగ్గించుకోవడం లేదు. అలాగే దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేశాయి. ఆ తర్వాత మన దేశంలో డాలర్ మారకంతో రూపాయి బలపడటం ప్రభావం చూపింది. క్లిష్ట పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా చూస్తారు.

ఏడేళ్ల గరిష్టానికి
అంతర్జాతీయ మార్కెట్లో రాత్రి 11 గంటల సమయంలో ఔన్స్ బంగారం 1,767 డాలర్లు, ఔన్స్ వెండి 18 డాలర్లకు పైగా ఉంది. ఔన్స్ అంటే 31.1 గ్రాములు. అంతకుముందు 1,779 డాలర్ల సమీపానికి కూడా చేరుకుంది. సోమవారం బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 7 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది.

1800 వద్ద నిరోధం.. ఆ మార్క్ దాటితే..
గ్లోబల్ మార్కెట్లో బంగారం 1,800 డాలర్ల వద్ద పటిష్ట నిరోధం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఈ స్థాయి దాటితే మాత్రం బంగారం మరింత వేగంగా పెరుగుతుందని, రికార్డ్ గరిష్టాలకు చేరుకుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం పసిడి అప్ ట్రెండ్ వైపు ఉందంటున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడ్ వడ్డీ రేటు నెగిటివ్‌లోకి వెళ్తే పసిడి 2011 ఆగస్ట్, సెప్టెంబర్ నాటి ఆల్ టైమ్ గరిష్టం 1,920 డాలర్లకు చేరుకోవచ్చునని చెబుతున్నారు. ఈ ఏడాదిలోపు బంగారం అంతర్జాతీయ మార్కెట్లో 2000 డాలర్లకు చేరుకోవచ్చునని వివిధ బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications