ఈ వారం బంగారం ధరలు ఎంత తగ్గాయంటే? డాలర్, చమురు ధరల క్షీణత
బంగారం ధరలు గతవారం స్వల్పంగా తగ్గాయి. ఆగస్ట్ 7వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 పలికిన పసిడి, ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. దాదాపు రెండు నెలలు రూ.50,000 నుండి రూ.52,000 మధ్య కదలాడింది. ఆ తర్వాత వ్యాక్సీన్ ప్రకటనతో నవంబర్ చివరలో రూ.47,500 స్థాయికి దిగి వచ్చింది. బ్రిటన్‌లో కరోనా మహమ్మారి న్యూస్ట్రెయిన్ నేపథ్యంలో ఆ తర్వాత ధరలు రూ.50వేల పైకి చేరుకున్నాయి. ఓ దశలో రూ.51,000 సమీపానికి చేరుకున్నాయి. క్రితం వారం పెరిగిన ధరలు, ఈ వారం మాత్రం అతి స్వల్పంగా తగ్గాయి.

గతవారం ఎంత తగ్గిందంటే
బంగారం ధరలు గతవారం రూ.230కి పైగా లేదా 0.46 శాతం క్షీణించాయి. వారంలో నాలుగు సెషన్‌లలో రెండు సెషన్లలో లాభపడగా, మరో రెండు సెషన్లలో నష్టపోయింది. శుక్రవారం మార్కెట్లకు సెలవు దినం. గతవారం ధరలు తగ్గినప్పటికీ, ఫ్యూచర్ మార్కెట్లో రూ.50,000 పైనే ముగిశాయి. చివరి సెషన్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.85.00 (-0.17%) క్షీణించి రూ.50064.00 వద్ద ముగిసింది. ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,198గా ఉంది. వెండి కూడా స్వల్పంగా తగ్గింది. వస్తే సిల్వర్ ఫ్యూచర్ మార్చి కిలో రూ.67518.00, మే ఫ్యూచర్ రూ.68160.00 వద్ద క్లోజ్ అయింది.
చివరి సెషన్లో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 0.26 శాతం ఎగిసి 1,883 డాలర్ల వద్ద, సిల్వర్ ఔన్స్ 0.08 శాతం పెరిగి 25.942 డాలర్ల వద్ద ముగిసింది.

డాలర్ క్షీణత
సిక్స్ బాస్కెట్ కరెన్సీలో డాలర్ వ్యాల్యూ 0.10 శాతం క్షీణించి 90.25 వద్ద ముగిసింది. మొత్తంగా ఈ వారంలో 0.33 శాతం పడిపోయింది. గతవారం డీలర్ డిస్కౌంట్ ఆఫర్ 1 డాలర్ కాగా, ఇప్పుడు 2 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ అతిపెద్ద గోల్డ్ హోల్డింగ్స్ SPDR గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 1,167.52 టన్నులుగా నమోదయింది. ఇక, ఎంసీఎక్స్ బుల్ డెస్క్ 39 పాయింట్లు లేదా 0.25 శాతం క్షీణించి 15,603 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.

చమురు ధరలు
ఇక, చమురు ధరలు గతవారం 3 శాతం మేర క్షీణించాయి. న్యూకరోనా వైరస్ స్ట్రెయిన్ నేపథ్యంలో డిమాండ్ పడిపోతుందనే భయాందోళనలో చమురు ధరలు పడిపోయాయి. ఫిబ్రవరి WTI క్రూడాయిల్ 1.01 డాలర్లు లేదా 2.05 శాతం తగ్గి 48.23 డాలర్ల వద్ద, ఫిబ్రవరి బ్రెంట్ క్రూడ్ 0.97 డాలర్లు లేదా 1.89 శాతం తగ్గి 51.29 డాలర్లకు పడిపోయింది.


Click it and Unblock the Notifications