భారీగా తగ్గిన బంగారం ధర, రూ.2,200 తగ్గిన వెండి: కారణాలివే...
బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కరోనా నుండి కోలుకొని, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కావడంతో పసిడిపై కాస్త ఒత్తిడి తగ్గింది. తాజాగా, ఆర్థిక ప్యాకేజీపై చర్చలను అర్ధాంతరంగా ముగిస్తున్నట్లు అగ్రరాజ్యం అధ్యక్షులు ప్రకటించారు. దీంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించాయి. ఈ ప్రభావం మన మార్కెట్లపై పడింది. దీంతో ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200 (ఆగస్ట్ 7)తో చూస్తే ధరలు మళ్లీ రూ.6వేలకు పైగా తగ్గింది. వెండి కిలో రూ.20వేలకు పైగా క్షీణించింది.

ఎంసీఎక్స్‌లో భారీగా తగ్గిన ధర
బుధవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల పసిడి రూ.500 వరకు క్షీణించి రూ.50,048 పలికింది. కిలో వెండి రూ.700కు పైగా తగ్గి రూ.60వేల దిగువకు వచ్చింది. రూ.59,820 పలికింది. సాయంత్రానికి డిసెంబర్ ఫ్యూచర్స్ బిజినెస్ టర్నోవర్ 15,297 లాట్లు, ఫిబ్రవరి ఫ్యూచర్స్ బిజినెస్ టర్నోవర్ 680 లాట్లుగా ఉంది. వ్యాల్యూపరంగా డిసెంబర్, ఫిబ్రవరి ఫ్యూచర్ వరుసగా రూ.3,677.32 కోట్లు, రూ.52.22 కోట్లుగా ఉంది. గోల్డ్ మినీ కాంట్రాక్ట్ నవంబర్ రూ.424 క్షీణించి రూ.50,193 పలికింది. బిజినెస్ టర్నోవర్ 11,582 లాట్లుగా ఉంది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.2,240 తగ్గి రూ.58,872 పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో ధరలు
అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ కామెక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ పసిడి ధర 1 శాతానికి పైగా క్షీణించి 1,889 డాలర్లు పలికింది. కామెక్స్‌లో ఈ వారం పసిడి ధరలు 1860 డాలర్ల నుండి 1900 డాలర్ల మధ్య ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1,877 డాలర్లు పలికింది. వెండి ఔన్స్ ధర 23.73 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ అతిపెద్ద గోల్డ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ వద్ద బంగారం నిల్వలు 4.1 టన్నులు తగ్గి 1271.51 టన్నులుగా ఉంది.

వివిధ నగరాల్లో ధరలు..
నిన్న ముంబై బులియన్ మార్కెట్లో పసిడి ధరలు క్షీణించాయి. 10 గ్రాముల 18 క్యారెట్లు, 22 క్యారెట్లు, 24 క్యారెట్ల ధరలు వరుసగా రూ.37,715, రూ.46,063, రూ.50,287 పలికింది. దీనికి జీఎస్టీ అదనం.ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.700 వరకు క్షీణించి రూ.51,215 పలికింది. నిన్న రూ.51,909 పలికింది.
రూపాయి వ్యాల్యూ బలపడటం, అమెరికా ఆర్థిక ప్యాకేజీ వాయిదా, డాలర్ వ్యాల్యూ పెరగడం వంటి వివిధ కారణాలతో పసిడి ధర తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధర 24 క్యారెట్లు రూ.52,850, 22 క్యారెట్ల పసిడి రూ.48,450 పలికింది.


Click it and Unblock the Notifications