నేడు స్వల్పఊరట: 2 రోజుల్లో రూ.1,500 పెరిగిన బంగారం: అందుకే.. ఇక మరింత పైపైకి!
గత వారం రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలు శాంతించాయి. అంతకుముందు రెండు రోజుల్లోనే రూ.1500 పెరిగిన పసిడి, కిలో రూ.6,000 పెరిగిన వెండి కాస్త ఊరటనిచ్చాయి. ఎంసీఎక్స్‌లో ఆగస్డ్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు స్వల్పంగా 0.1 శాతం తగ్గి రూ.52,540కి చేరుకుంది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.18 శాతం తగ్గి కిలో రూ.65,123 పలికింది. బంగారం సోమవారం రూ.1,000, మరుసటి సెషన్‌లో రూ.550 (1 శాతం) పెరిగింది. అంటే రెండు రోజుల్లోనే రూ.1500 పెరిగింది. కానీ తగ్గుదల అతి స్వల్పంగా ఉంది. అంతకుముందు సెషన్‌లో వెండి కిలో రూ.67,560 పలికింది. అయితే లాభాలు తీసుకోవడానికి మొగ్గుచూపడంతో 0.4 శాతం తగ్గింది. గరిష్టం రూ.67,560తో పోలిస్తే రూ.2,300కు పైగా తగ్గింది.

25% పెరిగిన వెండి, 2 రోజుల్లో రూ.1500 పెరిగిన బంగారం
ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు రూ.52,000 పైకి, వెండి ధర రూ.67,000 పైకి చేరుకొని రికార్డు సృష్టించాయి. గత ఏడు సెషన్‌లలోనే వెండి ధరలు 25 శాతం పెరిగాయి. అంతకుముందు వారం కిలో వెండి రూ.54వేలుగా ఉంటే ఓ సమయంలో రూ.67వేలకు చేరుకుంది. ప్రస్తుతం రూ.65వేలకు పైన పలుకుతోంది. ఇక బంగారం ధర రెండు రోజుల్లోనే రూ.1500 ఎగిసింది. వివిధ కారణాలతో బంగారం ధరలు రానున్న 12 నెలల్లో పది గ్రాములు రూ.65వేలకు చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.

హైదరాబాద్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం
హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం 10 గ్రాముల బంగారం రూ.54,000 రూ.55,000 మధ్య తచ్చాడుతోంది. ఓ సమయంలో రూ.54,940 పలికి.. రూ.55వేల సమీపానికి చేరుకుంది. ఇది ఆల్ టైమ్ గరిష్టం. 22 క్యారెట్ల బంగారం కూడా రూ.50వేలు దాటింది. కిలో వెండి రూ.67వేలకు పైన పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.52,450 పలికింది. వరుసగా ఏడు రోజుల పాటు బంగారం ధరలు పెరిగాయి. ఈ రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.

పెరుగుదలకు కారణాలు
ద్రవ్యోల్భణం, గ్లోబల్ పసిడి మార్కెట్, అమెరికా డాలర్, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు తగ్గడం, జ్యువెల్లరీ మార్కెట్, అమెరికా-చైనా మధ్య ఉద్రిక్తతలు, ట్రేడ్ వార్, ఆయా దేశాల ప్రభుత్వాల ప్యాకేజీలు వంటి పలు కారణాలు బంగారం, వెండి ధరల పెరుగుదలకు కారణం. మరోవైపు పండుగలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు సమయం కావడం గమనార్హం. ఈ వారంలో జరిగే ఫెడ్ రిజర్వ్ సమావేశంలో బంగారం, వెండి ట్రేడర్లకు అనుకూలమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే వడ్డీ రేట్లు జీరోకు తీసుకు వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో స్పాట్ గోల్డ్ ధరలను ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు రికార్డ్ గరిష్టాన్ని తాకాయి. ఔన్స్ స్పాట్ గోల్డ్ 1957 పలికింది. అంతకుముందు సెషన్‌లో బంగారం 1980.57తో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. గత ఆరు సెషన్‌లలోనే బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో 160 డాలర్లు పెరిగింది. బంగారం ఔన్స్ 2,000 డాలర్లు చేరుకోవడానికి మరెంతో సమయం లేదని భావిస్తున్నారు. బంగారం ధర రానున్న 6 నెలల నుండి 12 నెలల్లో ఔన్స్ ధర 2,300 చేరుకోవచ్చునని సిటీ బ్యాంకు అంచనా వేస్తోంది.


Click it and Unblock the Notifications