Gold price today: రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్, భారీగా పెరిగిన బంగారం ధరలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు నేడు మరింత పెరిగిన నేపథ్యంలో పసిడి ధరలు పెరిగాయి. ఇరుదేశాల మధ్య చర్చలు జరుగుతాయని భావించిన సమయంలో క్యీవ్, ఖార్కివ్‌లో పేలుళ్లు జరిగాయి. ఇది సమస్యను జఠిలం చేసింది. మరోవైపు, అంతర్జాతీయ సమాజం రష్యాను తప్పుబడుతూ, చర్చలకు వెళ్లాలని సూచిస్తోంది. ఈ నేపథ్యంలో ఎటు వైపు వెళ్తుందో అర్థం కాని పరిస్థితి.
ఈ ప్రభావం సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి భారీ పెరుగుదలకు కారణమవుతోంది. గోల్డ్ ఫ్యూచర్ మళ్లీ రూ.51,000ను క్రాస్ చేశాయి. గతవారం చివరలో రూ.53,000 దిశగా కనిపించి చివరి సెషన్‌లో సానుకూల వాతావరణం కారణంగా రూ.50,000స్థాయికి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ రూ.52,000ను తాకింది.

బంగారం ధరలు
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.722 లేదా 1.44 శాతం పెరిగి రూ.50,943 వద్ద ట్రేడ్ అయింది. నేడు ఓ సమయంలో రూ.51,200 క్రాస్ చేసింది. గత సెషన్‌లో రూ.50,200 స్థాయిలో ముగిసింది. కానీ రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల కారణంగా ఆరంభంలోనే రూ.600కు పైగా పెరుగుదలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.750 పెరిగి రూ.51,110 వద్ద ట్రేడ్ అయింది.
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1910 డాలర్లకు చేరువైంది. నేడు ప్రారంభ సెషన్‌లో ఏకంగా 22 డాలర్లు లాభపడి 1909 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

వెండి ధరలు
వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1062 లేదా 1.66 శాతం లాభపడి రూ.65,085 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.995 పెరిగి రూ.65,900 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 24 డాలర్లు క్రాస్ చేసింది. సిల్వర్ ఫ్యూచర్ 0.413 డాలర్లు లేదా 1.72 శాతం పెరిగి 24.410 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

పెరుగుదలకు కారణాలు
రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలకు బ్రేక్ పడటం, రష్యాపైన యూరోపియన్ దేశాల తీవ్ర ఆంక్షలు, వ్లాదిమిర్ పుతిన్ న్యూక్లియర్ హైఆలర్ట్ ప్రకటన నేపథ్యంలో పసుపులోహం ధర పెరిగింది. అయితే ఐక్య రాజ్య సమితి ఎమర్జెన్సీ సెషన్, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలకు మళ్లీ అవకాశం వంటి అంశాలు బంగారంపై ప్రభావం చూపుతాయి. రష్యా-ఉక్రెయిన్ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి.


Click it and Unblock the Notifications