బంగారం ధరలు వరుసగా క్షీణిస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ 0.51 శాతం తగ్గి 10 గ్రాములు రూ.51,009 పలికింది. సిల్వర్ సెప్టెంబర్ ఫ్యూచర్ 2.31 శాతం పడిపోయి కిలో రూ.64,175 పలికింది. ఈ నెల గరిష్టం నుండి బంగారం ధరలు రూ.5000 వరకు తగ్గాయి. కిలో వెండి రూ.78,000 నుండి దాదాపు రూ.14వేలు తగ్గింది. రష్యా వ్యాక్సీన్ వచ్చినప్పటి నుండి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పసిడిపై ఒత్తిడి తగ్గి, బులియన్ మార్కెట్లో తగ్గుముఖం పట్టింది.

నగరాల్లో ధరలు.. మరింతగా తగ్గే ఛాన్స్
దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధరలు 22 క్యారెట్లు స్వల్పంగా క్షీణించి రూ.51,700 నుండి రూ.51,250 డాలర్లు పలికింది. 24 క్యారెట్ల పసిడి రూ.54,870 పలికింది. 22 క్యారెట్ల పసిడి చెన్నైలో రూ.50,000 నుండి రూ.49,480 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం చెన్నైలో రూ.54,050, ముంబైలో రూ.50,350 పలికింది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్‌లో ధరలు
హైదరాబాద్ మార్కెట్‌లో పసిడి ధర క్షీణించింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.500కు పైగా తగ్గి రూ.49,480 పలికింది. 24 క్యారెట్ల పసిడి కూడా దాదాపు అంతే తగ్గి రూ.54,050 పలికింది. ఈ వారంలో పసిడి ధరలు దాదాపు వెయ్యికి పైగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఓ సమయంలో పసిడి ధరలు రూ.59వేలకు చేరువయ్యాయి. ఆ ధరతో రూ.5000 తగ్గుదల ఉంది. కిలో వెండి రూ.1200 తగ్గి రూ.65 వేలకు పైన పలికింది.

అంతర్జాతీయ మార్కెట్లో..
అంతర్జాతీయ మార్కెట్లో బసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1,927.26 డాలర్ల వద్ద ఉంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.5 శాతం పెరిగి ఔన్స్ 1,933.60 డాలర్లు పలికింది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు 0.3 శాతం పడిపోయి 1,248.87 టన్నులుగా ఉంది. సోమవారం రోజు ఇది 1,252.38గా నమోదయింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు ఔన్స్ 26.43 డాలర్లుగా ఉంది. ప్లాటినమ్ 0.1 శాతం పెరిగి 928.12 డాలర్లు, పల్లాడియం 0.6 శాతం క్షీణించి 2,151.50 డాలర్లుగా ఉంది.

తగ్గుదల.. పెరుగుదల
బంగారం ధరలు మరింతకాలం ఇలాగే అస్థిరంగా ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్వల్ప క్షీణత/పెరుగుదల నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రష్యా వ్యాక్సీన్ రాగానే భారీగా తగ్గింది. ఈ వ్యాక్సీన్ పైన కొన్ని అనుమానాలు ఉండటం, మరో అందరికీ ఆమోదయోగ్య వ్యాక్సీన్ వచ్చే వరకు ధరల్లో ఇలా స్వల్ప తేడాలు ఉండే అవకాశముందని అంటున్నారు. వ్యాక్సీన్ ఇప్పట్లో రాదని అధికారిక ప్రకటన వస్తే మళ్లీ భారీగా పెరగవచ్చునని, వ్యాక్సీన్ వస్తే మాత్రం అదే స్థాయిలో తగ్గుదల నమోదు చేయవచ్చునని అంటున్నారు.


Click it and Unblock the Notifications