ఇక్కడ బంగారం తగ్గుదల, అక్కడ 2వారాల గరిష్టానికి పసిడి
ఫ్యూచర్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు (సోమవారం, అక్టోబర్ 5) సాయంత్రం సెషన్ సమయానికి మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల డిసెంబర్ డెలివరీ రూ.200 (0.3) వరకు క్షీణించి రూ.50,380 పలికింది. బిజినెస్ టర్నోవర్ 15,541 లాట్లుగా ఉంది. ఫిబ్రవరి ఫ్యూచర్ రూ.250 (0.5 శాతం) క్షీణించి రూ.50,425 పలికింది. బిజినెస్ టర్నోవర్ 625 లాట్లుగా ఉంది. డిసెంబర్, ఫిబ్రవరి ట్రేడ్ వ్యాల్యూ వరుసగా రూ.2,836.35 కోట్లు, రూ.45.29 కోట్లుగా ఉంది. నవంబర్ గోల్డ్ మినీ కాట్రాక్ట్ రూ.175 పెరిగి రూ.50,485 పలికింది. బిజినెస్ టర్నోవర్ 10,679 లాట్లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధర
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. ఔన్స్ పసిడి 0.7 శాతం ఎగిసి 1,920 డాలర్లు పలికింది. ట్రేడింగ్‌లో కనిష్టం 1900 డాలర్లకు దిగువకు వచ్చింది. అలాగే 1920 డాలర్లను తాకింది. ఆ తర్వాత 1920.25 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ఔన్స్ ధర 1.96 శాతం ఎగిసి 24.492 డాలర్లు పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు ఆగస్ట్ మాసంలో ఆల్ టైమ్ గరిష్టం 1972 డాలర్ల పైకి చేరుకున్న విషయం తెలిసిందే. గరిష్ట ధరతో 150 డాలర్లకు పైగా తక్కువ పలుకుతోంది. ప్రపంచ అతిపెద్ద గోల్డ్ ఈటీఎఫ్ ఎస్పీడీఆర్ వద్ద బంగారం నిల్వలు 1,275.60 టన్నులకు పెరిగింది.

రెండు వారాల గరిష్టం
బంగారం ధర ఔన్స్ 1920 డాలర్లకు చేరుకొని రెండు వారాల గరిష్టానికి చేరుకుంది. సెప్టెంబర్ 22వ తేదీ తర్వాత తొలిసారి ఈ మార్క్ చేరుకుంది. సిక్స్ కరెన్సీ బాస్కెట్‌లో డాలర్ వ్యాల్యూ క్షీణించడంతో బంగారంపై ఒత్తిడి పెరిగింది. బంగారం ధర పెరిగినప్పటికీ, వాల్‌స్ట్రీట్‌లో ఈక్విటీ షేర్ల కూడా భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. డౌజోన్స్ 1.25 శాతం, నాస్‌డాక్ 1.60 శాతం లాభపడింది. వెండి కూడా సెప్టెంబర్ 22 తర్వాత 24 డాలర్లకు చేరుకుంది.

1938 డాలర్లకు చేరుకునే అవకాశం
బంగారం ధరలు 1920 డాలర్లకు చేరుకున్నదని, తదుపరి 1938 డాలర్లకు చేరుకునే అవకాశాలు కొట్టిపారేయలేమని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న పసిడి ఆల్ టైమ్ గరిష్టం 1917, నిన్న ఆల్ టైమ్ కనిష్టం 1889.93 డాలర్లు పలికింది. గతవారం గరిష్టం 1917.16 డాలర్లు, కనిష్టం 1848.82 డాలర్లు, గత నెల గరిష్టం 1992 డాలర్లు కాగా, కనిష్టం 1848 డాలర్లు.


Click it and Unblock the Notifications