గత కొద్ది రోజులుగా అస్థిరంగా ఉన్న పసిడి ధరలు భారీగా తగ్గాయి. ఎంసీఎక్స్‌లో, బులియన్ మార్కెట్లు గురువారం క్షీణించాయి. డాలర్ వ్యాల్యూ, కరోనా కేసులు, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం వంటి వివిధ కారణాల వల్ల పసిడిపై ఒత్తిడి తగ్గింది. గత నెల రష్యా వ్యాక్సీన్ విడుదల ముందు వరకు ధరలు ఆకాశమే హద్దుగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో రూ.56 వేలు దాటగా, బులియన్ మార్కెట్లో రూ.59 వేల సమీపానికి చేరుకుంది. రష్యా వ్యాక్సీన్ తర్వాత ధరలు అమాంతం పడిపోయాయి. అయితే ఆ తర్వాత స్వల్పంగా తగ్గుదల, పెరుగుదల నమోదు చేస్తూ ఆస్థిరంగా కనిపించాయి. తాజాగా నిన్న మరోసారి భారీగా తగ్గాయి.

భారీగా తగ్గిన పసిడి ధర
బంగారం ధరలు నిన్న (గురువారం) దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాములు రూ.775 తగ్గి రూ.51,755 పలికింది. అంతకుముందు సెషన్లో దీని ధర రూ.52,530గా ఉంది. వెండి ధర కిలో రూ.1900కు పైగా తగ్గి రూ.69,176 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లు పసిడి ధరలు తగ్గడంతో ఈ ప్రభావం మన మార్కెట్లపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.16 శాతం తగ్గి రూ.51 వేల దిగువకు వచ్చింది. వెండి సెప్టెంబర్ ఫ్యూచర్స్ కిలో రూ.65వేల దిగువకు వచ్చింది.

బంగారం ధర మరింతగా తగ్గే అవకాశం
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర నిన్న 1934 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. వెండి ఔన్స్ ధర 27.24 వద్ద ట్రేడ్ అయింది. ఇతర కరెన్సీలతో అమెరికా డాలర్ పెరగడంతో బంగారం ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇటీవలి వరకు కరెన్సీ బాస్కెట్‌లోని ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ క్షీణించింది. ఇప్పుడు బలపడుతోంది. కరోనా కారణంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది. నిరుద్యోగ సమస్య తగ్గుముఖం పడుతోంది. ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో పసిడి ధరలపై ఒత్తిడి తగ్గుతోంది.

ఇప్పటికే 150 డాలర్లు తగ్గుదల.. మరింత దిద్దుబాటు
అయితే వ్యాక్సీన్ పైన మరింత క్లారిటీ వచ్చే వరకు పసిడి ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా అస్థిరంగానే కనిపించే అవకాశాలు ఉన్నాయి. అమెరికా డాలర్, బంగారం కీలక కూడలిలో ఉన్నాయి. దీర్ఘకాలంలో బంగారంపై పెట్టుబడి సముచిత నిర్ణయమే. ఓ సమయంలో ఇటీవల రికార్డ్ 2,075 డాలర్లకు చేరుకున్న పసిడి ఇప్పుడు 7 శాతం మేర క్షీణించి 2000 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ దిద్దుబాటు మరింత కాలం కొనసాగుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications