Gold Price today: శుభవార్త.. బంగారం ధరలు తగ్గుతున్నాయ్
దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో రూ.50,000 దిశగా పరుగుపెట్టినట్లుగా కనిపించిన బంగారం ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. మళ్లీ రూ.48,000 స్థాయికి వచ్చాయి. ఈ వారంలో వరుసగా రెండో సెషన్లోను పసిడి కిందకు పడిపోయింది. నేటి ప్రారంభ సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ స్వల్పంగా రూ.85 క్షీణించి రూ.48,155 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్‌లో అయితే భారీగా తగ్గాయి. నిన్న ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ 0.73 శాతం లేదా రూ.357, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.400 వరకు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోను క్రితం సెషన్‌లో 1794 డాలర్ల వద్ద ముగిసింది. నేడు మరింతగా తగ్గుతున్నాయి.

బంగారం ధరలు
ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.85 తగ్గి రూ.48,155 వద్ద, ఏప్రిల్ ఫ్యూచర్స్ రూ.65 క్షీణించి రూ.48,245 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో ఉదయం గం.10 సమయానికి 3.15 డాలర్లు తగ్గి 1791.45 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో పోలిస్తే రూ.8000 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో 285 డాలర్ల వరకు తక్కువగా ఉంది. ఇక ఏడాదిలో దాదాపు 6 శాతం క్షీణతతో ఉంది.

వెండి ధరలు
వెండి ధరలు కూడా వరుసగా రెండు రోజులుగా తగ్గుతున్నాయి. అయితే ఈ తగ్గుదల స్వల్పంగా మాత్రమే కనిపిస్తోంది. ఎంసీఎక్స్‌లో మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.127 తగ్గి రూ.61,290 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.103 తగ్గి రూ.61,896 వద్ద ట్రేడ్ అయింది. ఆల్ టైమ్ గరిష్టంతో సిల్వర్ ఫ్యూచర్స్ రూ.18,000 వరకు తక్కువగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి 23 డాలర్లకు దిగువనే ఉంది. నేటి సెషన్లో 0.044 డాలర్లు క్షీణించి 22.247 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

అందుకే ధరల తగ్గుదల
ఓ వైపు ఒమిక్రాన్ భయాందోళనలు, ద్రవ్యోల్భణ ఆందోళనలు, లాక్ డౌన్ భయాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. మరోవైపు, గోల్డ్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పసిడి ధరలు తగ్గుతున్నప్పటికీ, అది అంతంత మాత్రమే. ప్రస్తుత ఒమిక్రాన్ పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడిలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు.
అయితే రికవరీ సంకేతాలు కాస్త బలంగా ఉండటం, ఒమిక్రాన్ ప్రభావం మళ్లీ పెరిగినట్లుగా కనిపించినప్పటికీ, కొద్దిరోజులు మాత్రమేననే అభిప్రాయాలు ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. అందుకే పసిడి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో ధరలు స్వల్పంగా తగ్గుతున్నాయి.


Click it and Unblock the Notifications