బంగారం భారీ షాక్, మూడ్రోజుల్లో రూ.3000 జంప్: రూ.56,200కు అడుగు దూరంలోనే...
బంగారం ధరలు కొండెక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ఫ్యూచర్ ఆల్ టైమ్ గరిష్టానికి కేవలం 10 డాలర్ల దూరంలో ఉంది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీ(MCX)లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.1000కి పైగా పెరిగి రూ.54,500 క్రాస్ చేసింది. గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200. అంటే కేవలం రూ.1700 దూరంలో మాత్రమే ఉంది. ఎంసీఎక్స్, కామెక్స్‌లో పసిడి ఫ్యూచర్ ఆల్ టైమ్ గరిష్టానికి కేవలం అడుగు దూరంలో ఉంది. అయితే నేడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెనుకడుగు వార్తలు బంగారాన్ని ముందుకు తీసుకెళ్లకపోవచ్చు. మరోవైపు స్టాక్ మార్కెట్ పుంజుకునే అవకాశాలున్నాయి.

నేడు బంగారం ధరలు
ఈ వార్త రాసే సమయానికి కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 22 డాలర్లు లేదా 1.08 శాతం లాభపడి 2.065 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేడు 2,043.00 - 2,065.90 డాలర్ల మధ్య కదలాడింది. పసిడి 52 వారాల కనిష్టం 1682 డాలర్లు, గరిష్టం 2077 డాలర్లు. ఏడాదిలో పసిడి ధరలు 22 శాతం వరకు పెరిగాయి.
బంగారం ధరలు నేడు కూడా పెరుగుతున్నాయి. ఈ వారం ప్రారంభ సెషన్(సోమవారం) రూ.1100కు పైగా పెరిగిన పసిడి, నిన్న రూ.1000కి పైగా పెరిగింది. నేడు ప్రారంభ సెషన్‌లోనే రూ.860 ఎగిసిపడింది. అంటే ఈ మూడు రోజుల్లో దాదాపు రూ.3000 జంప్ చేసింది. రూ.52,000 స్థాయిలో ఉన్న పసిడి నేటి ఉదయం సెషన్‌లో రూ.55,083కు పెరిగింది. ఓ సమయంలో రూ.55,144 వద్ద ట్రేడ్ అయింది.

వెండి ధరలు
వెండి ధరలు రూ.71,000 క్రాస్ చేసి, రూ.72,000 దిశగా పరుగు పెడుతున్నాయి. నేడు మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1721 లాభపడి రూ.71,690 వద్ద, జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1565 ఎగిసి రూ.72,300 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.480 డాలర్లు లేదా 1.78 శాతం ఎగిసి 27.370 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

మరింత పెరుగుతాయా, తగ్గుతాయా?
బంగారం ధరలు మరింత పెరుగుతాయా, తగ్గుతాయా అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆల్ టైమ్ గరిష్టానికి అడుగు దూరంలో ఉన్న సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు వచ్చేలా కనిపిస్తోంది. జెలెన్‌స్కీ నాటో కూటమిలో చేరనని యుద్ధంలో అడుగు వెనక్కి వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే రష్యా యుద్ధానికి ముగింపు పలకవచ్చు. అయితే మరిన్ని రష్యా డిమాండ్లకు జెలెన్‌స్కీ ఆమోదిస్తారా అనే అంశాలపై ఆధారపడి యుద్ధం ముగింపు ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం కాస్త సానుకూలమని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications