నేటి బంగారం ధరలు ఇలా, ఇప్పటి దాకా ఎంత పెరిగిందంటే?
గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ ఈ రోజు (జూన్ 1, సోమవారం) స్వల్పంగా తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఉదయం గం.9.30 సమయానికి ఆగస్ట్ గోల్డ్ కాంట్రాక్ట్స్ 0.18 శాతం పడిపోయి రూ.47,018 పలికింది. అయితే వెండి ధర మాత్రం పెరిగింది. ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్స్ కిలోకు 0.6 శాతం పెరిగి రూ.50,409 పలికింది. శుక్రవారం నాటితో పోలిస్తే ఏకంగా రూ.1,600 పెరిగింది.

బంగారం ధర..
బహిరంగ మార్కెట్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్‌లో సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా దాదాపు అంతే పెరిగి రూ.49,150 పలికింది. కిలో వెండి వెండి రూ.1550 పెరిగింది.

2020లో ఇప్పటి దాకా ఎంత పెరిగిందంటే
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.8 శాతం పెరిగి 1,739.75 డాలర్లు పలికింది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం పెరిగి ఔన్స్ 1,752.60 డాలర్లు పలికింది. వెండి 2 శాతం పెరిగి ఔన్స్ 18.20 డాలర్లు పలికింది. ఫిబ్రవరి 26వ తేదీ నుండి ఈ ధర పలకడం మొదటిసారి. ప్రపంచ అతిపెద్ద గ్లోబల్ బ్యాక్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఎస్పీడీఆర్ గోల్డ్ ట్రస్ట్ వద్ద బంగారం నిల్వలు శుక్రవారం నాటికి 0.3 శాతం పెరిగి 1,123.14 టన్నులకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మే నెలలో ఔన్స్‌కు 57 డాలర్లు పెరిగి, గత శుక్రవారం నాటికి 1,731కు చేరుకుంది. మూడు నెలల్లో 155 డాలర్లు పెరిగింది. 2020లో ఇప్పటి వరకు 228 డాలర్లు ఎగిసింది.

అంతర్జాతీయంగా అస్థిరత్వం
అమెరికాలో జాతి వివక్ష ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంటును దెబ్బతీస్తున్నాయి. ఇటీవల ఓ పోలీస్ జార్జ్ ఫ్లాయిడ్ అనే వ్యక్తి తలపై కాలుతో తొక్కి చావుకు కారణమయ్యాడు. దీంతో అమెరికాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో అస్థిరత మార్కెట్ పైన ప్రభావం చూపిస్తోంది. హాంగ్‌కాంగ్‌పై చైనా కొత్త జాతియ భద్రతా చట్టాలు విధిస్తే తాము ఆ దేశానికి ప్రత్యేక హోదాకు ముగింపు పలుకుతామని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై చైనా, హాంగ్‌కాంగ్ ప్రభుత్వాలు విరుచుకుపడ్డాయి. అంతర్జాతీయంగా క్లిష్ట, అస్థిర పరిస్థితులు నెలకొనడంతో ఇన్వెస్టర్లు బంగారం దిశగా చూస్తున్నారు.

అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి సారించాలి
బంగారం ఈ వారం ఆగస్ట్ కాంట్రాక్ట్ రూ.47,607 ఎగువకు చేరుకోకుంటే రూ.46,263 వద్ద దిద్దుబాటుకు అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం ఈ స్టాప్ లాస్ వద్ద ట్రేడ్ చేయవచ్చునని అంటున్నారు. రూ.47,608 నుండి రూ.47,858 మధ్య లాంగ్ పొజిషన్లను వదిలించుకోవడం మేలని చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలపై కన్నువేసి ఉంచడం మంచిది.


Click it and Unblock the Notifications