తగ్గిన బంగారం ధరలు: హైదరాబాద్-విశాఖలో రూ.50,000 రికార్డ్‌కు చేరువలో..
బంగారం ధరలు సోమవారం (జూన్ 15) పడిపోయాయి. దేశంలో కరోనా కేసులు పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి రెండోసారి విజృంభిస్తుందనే ఆందోళనలతో ఈక్విటీ మార్కెట్లు నష్టపోతున్నాయి. చమురు ధరలు కూడా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా పసిడికి సానుకూల ధోరణి ఉన్నప్పటికీ దేశంలో మాత్రం ధరలు తగ్గుముఖం పట్టాయి.

తగ్గిన బంగారం ధరలు
నేడు మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (MCX)లో ఉదయం గం.10 సమయానికి జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.36 శాతం లేదా రూ.170 తగ్గి రూ.47,164 పలికింది. జూలై ఫ్యూచర్స్ వెండి 0.6 శాతం తగ్గి కిలో రూ.47,377 పలికింది. వెండి ధరలు రెండు రోజుల్లో రూ.1200 తగ్గింది. కరోనా రెండోసారి విజృంభిస్తుందనే భయాలు నెలకొనడంతో గత వారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. ఈ ప్రభావం మన మార్కెట్ పైన కూడా పడింది. అంతర్జాతీయ మార్కెట్లో గత వారం బంగారం ధరలు ఔన్స్ 1737 డాలర్ల వద్ద సెటిల్ అయింది. వెండి 17.58 డాలర్లు పలికింది.

గత వారం 2 శాతం పెరుగుదల
ఎంసీఎక్స్‌లో గత వారం బంగారం ధరలు 2 శాతం పెరిగి రూ.47,334 వద్ద నిలిచాయి. కిలో వెండి ధర రూ.47,690 పలికింది. మార్కెట్లో ట్రాయ్ ఔన్స్ ధర 1,745 డాలర్లు లేదా రూ.47,550 పలికింది. ఈ ధర 1,755/1,762 డాలర్ల వరకు లేదా రూ.47,800 - రూ.48,000 చేరుకోవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లో ఇతర అతి ఖరీదైన లోహాల విషయానికి వస్తే పల్లాడియం ఔన్స్ ధర 1,917.90 డాలర్లతో నిలకడగా ఉంది. ప్లాటినమ్ 0.8 శాతం పెరిగి 812.20 డాలర్లుగా ఉంది.

హైదరాబాద్, విశాఖ మార్కెట్లో రూ.50వేలకు సమీపంలో
బహిరంగ మార్కెట్లో మాత్రం బంగారం ధర అతిస్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 పెరిగి రూ.44,540, 24 క్యారెట్ల బంగారం ధర కూడా దాదాపు అంతే పెరిగి రూ.49,670 పలికింది. హైదరాబాద్‌లో బంగారం ధర రూ.50,000 మార్క్‌కు దగ్గరలో ఉంది. బెంగళూరులో కూడా స్వల్పంగా పెరిగి 22 క్యారెట్ల బంగారం రూ.44,870, 24 క్యారెట్ల బంగారం రూ.48,970 పలికింది. కేరళలో 22 క్యారెట్ల బంగారం రూ.43,770, 24 క్యారెట్ల బంగారం రూ.47,770 పలికింది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం రూ.45,540, 24 క్యారెట్ల బంగారం రూ.49,670 పలికింది.


Click it and Unblock the Notifications