బంగారం ధరలు ఈ రోజు అస్థిరంగా కనిపించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో 10 గ్రాముల అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,600 నుండి రూ.50,970 మధ్య ట్రేడ్ అయింది. అంతకుముందు సెషన్‌లో రూ.50,821 పలికింది. ఎంసీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరకు రూ.50,920 వద్ద ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా గత నాలుగైదు నెలలుగా పెరుగుతున్న పసిడి ధరలు ఇరవై రోజుల నుండి తగ్గుముఖం పట్టాయి.
ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ ప్రకారం జీఎస్టీ లేకుండా 999 ప్యూరిటీ పసిడి ధర రూ.50,927 వద్ద, 995 ప్యూరిటీ పసిడి రూ.50,723 వద్ద, 916 ప్యూరిటీ పసిడి ధర రూ.46,649 వద్ద క్లోజ్ అయింది. వెండి కిలో రూ.64,393 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో చివరి సెషన్లో పసిడి ధరలు 0.15 శాతం పెరిగి ఔన్స్ 1,946.50 డాలర్లు పలికింది. 1,932 డాలర్ల నుండి 1,956.60 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది.

ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ప్రధానంగా కరోనా కేసులు, వ్యాక్సీన్ అందుబాటుపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం ధరలు అధికంగా పెరగడంతో రిటైల్ కొనుగోలుదారులు తగ్గినప్పటికీ, ఇన్వెస్టర్లు మాత్రం పెట్టుబడికి ఆసక్తి కనబరుస్తున్నారు. అస్థిరంగా ఉండటంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమంటే బంగారం సరఫరా గత మూడేళ్లలో ఇతర అతి ఖరీదైన లోహాలకు భిన్నంగా కేవలం 0.6 శాతం మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. అంతేకాదు నిల్వలు కొత్తగా కనుగొనలేని పరిస్థితి. మరోవైపు కేంద్ర బ్యాంకులు పసిడి నిల్వలు పెంచుకుంటున్నాయి. ఈ పరిస్థితులు బంగారానికి సానుకూలమేనని అంటున్నారు. ఇలాగే ఉంటే ర్యాలీ ఉండే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications