కరోనా కొత్త వేరియంట్ ఎఫెక్ట్, భారీగా పెరిగిన బంగారం ధరలు
దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ ఆందోళనల నేపథ్యంలో బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పది గ్రాముల గోల్డ్ ఫ్యూచర్స్ రూ.600 వరకు పెరిగింది. దీంతో మళ్లీ రూ.48,000 క్రాస్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో 1800 డాలర్లు దాటింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.554 పెరిగి రూ.47,975 వద్ద, ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.579.00 (1.21%) లాభపడి రూ.48353.00 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వార్త రాసే సమయానికి గోల్డ్ ఫ్యూచర్స్ 1800 డాలర్ల వద్ద ఉంది. అంతకుముందు ఓ సమయంలో 1,816.20 డాలర్లను కూడా తాకింది. అయితే ఆ తర్వాత క్షీణించింది. క్రితం సెషన్లో 1,784.30 డాలర్ల వద్ద ట్రేడ్ అయిన పసిడి 32 డాలర్ల మేర పెరిగి 1816 డాలర్ల వద్దకు చేరుకుంది. వార్త రాసే సమయానికి 15 డాలర్లు పెరిగి 1800 డాలర్ల వద్ద ఉంది.
అయితే, గత వారం రోజులుగా బంగారం ధరలు భారీ ఊగిసలాటలో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ వారం బంగారం ధరలు భారీగా పడిపోయాయి.. అయితే అంతలోనే మళ్ళీ ఎగిసినప్పటికీ, తగ్గిన ధరలో కొంత మాత్రమే. గత ఐదు నెలల కాలంలో బంగారానికి వరస్ట్ వీక్ ఇది. ఎందుకంటే రూ.50,000 దిశగా కనిపించిన గోల్డ్ ఫ్యూచర్స్ మళ్లీ రూ.47,500 స్థాయికి పడిపోయాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల దిశగా కనిపించి, 1800 డాలర్ల దిగువకు పడిపోయింది. అంటే దాదాపు వంద డాలర్ల మేర క్షీణించింది. ఐదు నెలల కాలంలో ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. ద్రవ్యోల్భణాన్ని అదుపులో ఉంచేందుకు యూఎస్ ఫెడ్ రిజర్వ్ ప్యాకేజీని నిలుపు చేస్తుందని, వడ్డీరేట్లు త్వరలో పెంచవచ్చుననే వార్తల ప్రభావం పసిడిపై పడింది.

ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర రూ.47,250, నిరోధకస్థాయి రూ.47,900 నుండి రూ.48,000. వెండి రూ.64,000కు చేరుకునే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. కామెక్స్‌లో గోల్డ్ మద్దతు ధర 1770 డాలర్ల నుండి 1755 డాలర్లు. నిరోధకస్థాయి 1800 డాలర్ల నుండి 1815 డాలర్లు. 1800 డాలర్ల వద్ద బలమైన పరీక్షను ఎదుర్కోవచ్చునని అంచనా. కరోనా కేసులు పెరిగితే బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications