పెరిగిన బంగారం ధర, ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్‌పై అస్థిరత! ఓసారి భారీ పెరుగుదల, మరోసారి నిలకడ
బంగారం ధరలు ఈ రోజు (జూన్ 24, బుధవారం) పెరిగాయి. కరోనా కేసుల ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు వంటి వివిధ కారణాలతో పసిడి ధర నేడు పెరుగుదలతో ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో వివిధ ఆర్థిక వ్యవస్థలు మరిన్ని ప్యాకేజీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దీంతో సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు.

ఎంసీఎక్స్‌లో బంగారం ధరలు
దేశంలో కరోనా కేసులు నాలుగున్నర లక్షలకు పెరిగాయి. మరణాలు పద్నాలుగున్నర వేలకు చేరుకున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ పరిణామాలు ప్రభావం చూపాయి. ఉదయం ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు 0.04 శాతం ఎగిసి రూ.48,251 పలికింది. అయితే వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర 0.16 శాతం తగ్గి రూ.48,704 పలికింది. బంగారం ధరలు మన దేశంలో ఏడాది కాలంలో దాదాపు 40 శాతం పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ క్యాలెండర్ ఇయర్లో 16 శాతం వరకు పెరిగాయి.

స్వల్పకాలానికి.. రాబడిపై చెప్పలేం
కరోనా మహమ్మారి, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరలు గత కొంతకాలంగా అస్థిరంగా ఉన్నాయి. దీంతో దీర్ఘకాలంలో పసిడిపై పెట్టుబడికి ఎలాంటి ఆందోళన చెందడం లేదు. కానీ స్వల్పకాల పెట్టుబడులపై మాత్రం గందరగోళంగా ఉందని చెబుతున్నారు. భౌగోళిక, రాజకీయ, బిజినెస్ వంటి అంతర్జాతీయ స్థాయిలో అస్థిరతలు ఏర్పడిన సమయాల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఇప్పుడు కరోనా సమయం కూడా అందుకు అతీతం కాదు. దీర్ఘకాలంలో పెట్టుబడికి మంచి సాధనం. కానీ స్వల్పకాలానికి ఎప్పుడు అధిక రాబడిని ఇస్తుందో అంచనా వేయడం కష్టంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల ధరలు భారీగా పెరుగుతూ స్వల్పంగా తగ్గుతున్నాయి. అయితే కరోనా తర్వాత ధరలు స్థిరంగా ఉంటాయా స్వల్పంగా పడిపోతాయా అనేది ప్రశ్నగానే ఉందని చెబుతున్నారు.

ఐదేళ్లు దాదాపు నిలకడ..
కొన్ని సందర్భాల్లో బంగారం అధిక రిటర్న్స్ ఇవ్వడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఇప్పుడు కరోనా కారణంగా తక్కువ సమయంలో ఎక్కువ రాబడి ఇచ్చింది. 2013 జనవరి నుండి 2018 డిసెంబర్ వరకు బంగారం ధరలు మరీ అంతగా పెరగలేదు. ఒకటి రెండు శాతం మధ్యనే పెరిగింది. కానీ ఆ తర్వాత అనూహ్య పెరుగుదలను నమోదు చేసింది. ఇటీవల భారీగా పెరిగింది. 2005 నుండి చూస్తే 5 శాతం కంటే తక్కువగా పెరుగుతూ వచ్చింది. అంటే బంగారం ధరలు రిటర్న్స్ లాంగ్ టర్మ్‌లో స్వల్పంగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్వల్పకాలంలోను అధిక రిటర్న్స్ ఇవ్వవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లు, పరిణామాలను బట్టి ఉంటుంది.

బంగారంపై ఈ కాలంలో అధిక దిగుబడి
1990 నుండి బంగారంపై పెట్టుబడులు ఎక్కువగా పెరిగాయి 2008, 2010, 2011లలో బంగారం ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది. ఆ సమయంలో ఈక్విటీ మార్కెట్లు అల్లకల్లోలంగా ఉన్నాయి. 2019లో మందగమనం, 2020లో కరోనా కారణంగా 20 శాతం నుండి దాదాపు 40 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చాయి.


Click it and Unblock the Notifications