హైదరాబాద్, విజయవాడ సహా పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ.53,580 పలకగా, 22 క్యారెట్ల పసిడి రూ.49,120 పలికింది. ఢిల్లీ మార్కెట్లో 24 గ్రాముల పసిడి రూ.54,500కు పైన పలికింది. 22 క్యారెట్ల పసిడి 50 వేలకు పైన పలికింది. బులియన్ మార్కెట్లో పసిడి ధరలు గత రెండు రోజుల్లో రూ.800కు పైగా తగ్గాయి. ఎంసీఎక్స్ అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ చివరి సెషన్‌లో 1.07 శాతం పెరిగి 10 గ్రాములు రూ.51,450 పలికింది. కొద్ది రోజులుగా పసిడి ధరలు అస్థిరంగా కదలాడుతున్నాయి.

పసిడి మళ్లీ ర్యాలీ చేస్తుందా?
అంతర్జాతీయ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు కొంత ర్యాలీ కనబరిచాయి. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో బులియన్ మార్కెట్లు రేపటి నుండి కాస్త ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మళ్లీ 2000 డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. అయితే కరోనా కేసులు, వ్యాక్సీన్ ప్రభావం, అంతర్జాతీయ మార్కెట్లు, ట్రేడ్ వార్ వంటి వివిధ అంశాలు పసిడిపై ప్రభావం చూపనున్నాయి.

అలా అయితే ఒత్తిడి తగ్గుతుంది
బంగారానికి ప్రతికూల పరిస్థితులు ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో 1900 డాలర్ల వద్ద ఔన్స్ మద్దతు ధర కొనసాగవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అయితే 2000 డాలర్లకు పెరిగితే 2100 లెవల్‌కు చేరుకునే అవకాశాలను కొట్టి పారేయలేమని అంటున్నారు. ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు సానుకూలంగా ఉంటే, అమెరికా వంటి దేశాల్లో నిరుద్యోగిత రేటు క్రమంగా తగ్గితే మాత్రం పసిడిపై ఒత్తిడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.

ఇన్వెస్టర్లు..
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానంగా డాలర్ వ్యాల్యూ తగ్గుతూ ఉంటే, సెంట్రల్ బ్యాంకులు ద్రవ్య విధానాలు ప్రకటిస్తుంటే పెట్టుబడిదారులు బంగారం దిశగా చూసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. దేశీయ మార్కెట్లో గరిష్ట ధర నుండి రూ.5000 వరకు తగ్గినా రిటైల్ మార్కెట్లు ఇంకా ఆశించిన మేర పుంజుకోలేదు. అలాగే పసిడి ఇన్వెస్టర్లు కూడా రష్యా వ్యాక్సీన్ రాక తర్వాత ఆచితూచి వ్యవహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications