Gold prices today: భారీగా తగ్గిన బంగారం ధరలు, రెండ్రోజుల్లో రూ.1500 డౌన్
బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయినప్పటికీ రూ.50,000కు పైనే ఉంది. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రూ.51,000 క్రాస్ చేసి, రూ.52,000 దిశగా పరుగు పెట్టిన పసిడి దూకుడు మాత్రం తగ్గింది. రష్యా పైచేయి, అమెరికా కఠిన ఆంక్షలు వంటి అంశాలు స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్ పైన ప్రభావం చూపుతున్నాయి. దీంతో చివరి సెషన్‌లో పసిడి ధరలు తగ్గాయి. గురువారం సెషన్‌లో రూ.51,500 స్థాయిలో ఉన్న పసిడి శుక్రవారం సెషన్‌లో రూ.50,300 దిగువకు వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముందు నాటి ధర వద్ద ఉంది.

భారీగా తగ్గిన బంగారం ధరలు
ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.1273 లేదా 2.47 శాతం క్షీణించి రూ.50,270 వద్ద, జూన్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.1322 లేదా 2.56 శాతం క్షీణించి రూ.50,399 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రితం సెషన్‌లోనే గోల్డ్ ఫ్యూచర్స్ ఏకంగా 36 డాలర్ల మేర తగ్గింది. గోల్డ్ ఫ్యూచర్స్ 35.75 డాలర్లు లేదా 1.86 శాతం క్షీణించి 1890 డాలర్ల వద్ద ముగిసింది. ఓ దశలో 1950 డాలర్ల దిశగా దూసుకెళ్లిన గోల్డ్ ఫ్యూచర్స్ ఇప్పుడు 1900 డాలర్ల దిగువకు పడిపోయింది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. మార్చి సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1981 లేదా 3 శాతం క్షీణించి రూ.64,050 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.1948 లేదా 2.91 శాతం క్షీణించి రూ.64,950 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ఫ్యూచర్స్ 0.382 డాలర్లు లేదా 1.55 శాతం క్షీణించి 24.305 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ధరలు ఏడాదిలో 8.5 శాతం పెరగగా, వెండి ధరలు 8.28 శాతం క్షీణించాయి.

రెండ్రోజుల్లో 1000కి పైగా డౌన్
బంగారం ధరలు వివిధ నగరాల్లో రెండు రోజుల క్రితం భారీగా పెరిగి, ఇప్పుడు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 53,000 దాటినప్పటికీ, ఇప్పుడు రూ.52,000 దిగువన ఉంది. అహ్మదాబాద్ మార్కెట్‌లో రెండు రోజుల క్రితం రూ.54,000 స్థాయికి చేరుకుంది. ఇప్పుడు రూ.52,000 దిగువకు వచ్చింది. అంటే దాదాపు రూ.1000 నుండి రూ.1500 వరకు తగ్గింది.


Click it and Unblock the Notifications