ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి
కరెంట్ ఖాతా లోటు పైన ప్రభావం చూపించే పసిడి దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో భారీగా పెరిగి 2,400 కోట్ల డాలర్లకు చేరినట్లు కామర్స్ మినిస్ట్రీ డేటా వెల్లడిస్తోంది. మన కరెన్సీలో ఇది రూ.1,80,000 కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో పసిడి దిగుమతులు 680 కోట్ల డాలర్లుగా మాత్రమే నమోదయింది. ఈ సెప్టెంబర్ నెలలో 511 కోట్ల డాలర్ల పసిడి దిగుమతి నమోదయింది. 2020 సెప్టెంబర్ కాలంలో ఇది కేవలం 60.14 కోట్ల డాలర్లుగా మాత్రమే ఉంది. పసిడి దిగుమతుల్లో భారత్ వాటా అత్యధికం. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌కు తగినట్లు ఈ దిగుమతులు నమోదవుతాయి. ఏడాదికి సగటున 800 టన్నుల నుండి 900 టన్నుల పసిడిని భారత్ దిగుమతి చేసుకుంటోంది.
అదే సమయంలో వెండి దిగుమతులు 2021-22 ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో 15.5 శాతం మేర తగ్గి 61.93 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. ఒక్క సెప్టెంబర్ నెలలోనే వెండి దిగుమతులు 55.23 కోట్ల డాలర్లకు ఎగబాకాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలలో 92.3 లక్షల కోట్ల డాలర్లుగా నమోదయింది. బంగారం దిగుమతులు పెరగడంతో దేశ వాణిజ్య లోటు గత ఏడాది సెప్టెంబర్‌లో 2260 కోట్ల డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే నెలలో వాణిజ్య లోటు 296 కోట్ల డాలర్లుగా మాత్రమే నమోదయింది. వజ్రాల ఆభరణాల ఎగుమతులు ఏప్రిల్-సెప్టెంబర్ త్రైమాసికంలో 1930 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఎగుమతులు 870 కోట్ల డాలర్లు మాత్రమే. పండుగల సీజన్ కావడంతో పసిడికి డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో దిగుమతి పెరిగినట్లు చెబుతున్నారు.

మరోవైపు, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి గత సెప్టెంబర్ నెలలో రూ.446 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. తాజా పెట్టుబడులతో ఇప్పటి వరకు ఈ విభాగంలోకి రూ.3515 కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లుగా తెలుస్తోంది. పండుగ సీజన్ నేపథ్యంలో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ఈ పెట్టుబడులు మరింత అధికం అవుతాయని అంచనాలు ఉన్నాయి. జూలైలో ఈ విభాగంలో 61.5 కోట్ల మేర పెట్టుబడులు వెనక్కి మరలినట్లు భారత్ మ్యూచువల్ ఫండ్స్ సంఘం గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications