బంగారం దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఏప్రిల్-జూలై త్రైమాసికంలో 81.22 శాతం క్షీణించి, 2.47 బిలియన్ డాలర్లు(రూ.18,600 కోట్లు) పరిమితమయ్యాయి. కరోనామహమ్మారి నేపథ్యంలో డిమాండ్ తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేశాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో బంగారం దిగుమతులు 13.16 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే గత ఏడాది రూ.91వేల కోట్లకు పైగా ఉంది.

భారీగా తగ్గిన వాణిజ్య లోటు
బంగారం, వెండి ధరలు ఇటీవలి వరకు భారీగా పెరిగాయి. గత వారం నుండి తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో అమ్మకాలపై ప్రభావం పడింది. ధరలు తగ్గిన నేపథ్యంలో తిరిగి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే గత క్వార్టర్‌లో పసిడి ధరలు చుక్కలను తాకడంతో డిమాండ్ పడిపోయింది. బంగారం దిగుమతులు 81 శాతానికి పైగా తగ్గితే, వెండి దిగుమతులు గత 4 నెలల్లో 56.5 శాతం క్షీణించి, దాదాపు రూ.5,185 కోట్లకు తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ 4 నెలల్లో వాణిజ్యలోటు 5,940 కోట్ల డాలర్ల నుంచి 1,395 కోట్ల డాలర్లకు తగ్గింది. గత ఏఢాది డిసెంబర్ నుండి పసిడి దిగుమతులు పడిపోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో వరుసగా 62.6 శాతం, 99.93 శాతం, 98.4 శాతం, 77.5 శాతం చొప్పున క్షీణించాయి.

పడిపోయిన ఆభరణాల ఎగుమతులు
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ పసిడి ధర 2,000 డాలర్లకు దిగువన ఉంది. ఆగస్ట్ మొదటివారంలో 2000 డాలర్ల పైకీ చేరుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆభరణాల కొనుగోళ్లు తగ్గాయి. ఈ ప్రభావం మన దేశ ఆభరణాల ఎగుమతులపైనా కనిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూలైతో పోలిస్తే ఈసారి మన దేశం నుంచి ఆభరణాల ఎగుమతులు 66.36 శాతం తగ్గి 417 కోట్ల డాలర్లకు క్షీణించాయి.

ఈటీఎఫ్‌లలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు
జూలైలో కూడా పసిడి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)లలోకి పెట్టుబడులు భారీగా వచ్చాయి. జూన్ నెలతో పోలిస్తే పసిడి ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు 86 శాతం (రూ.921 కోట్లు) పెరగడం గమనార్హం. బంగారం ధరలు పెరుగుతుండటంతో కొత్త ఇన్వెస్టర్లు పసిడిని తమ పోర్ట్‌పోలియోల్లోకి చేర్చుకోవడానికి ఆసక్తి కనబరిచారు. యాంఫీ లెక్కల ప్రకారం జనవరి నుండి జూలై వరకు ఈటీఎఫ్‌లలోకి రూ.4,452 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. బులియన్ ర్యాలీకి తోడు స్టాక్ మార్కెట్లలో ఆటుపోట్లు కలిసి వస్తున్నాయి.


Click it and Unblock the Notifications