8 నెలల్లో బంగారం దిగుమతులు ఎంత తగ్గాయంటే? నవంబర్‌లో మాత్రం జంప్
2020-21 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల వరకు పసిడి దిగుమతులు 40 శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య కాలంలో దిగుమతులు 12.3 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో పసిడి ధరలకు డిమాండ్ తగ్గింది. దీనికి తోడు ధరలు కొద్ది నెలల్లోనే భారీగా పెరగడం కూడా ప్రభావం చూపింది. లాక్ డౌన్ సమయంలో సేల్స్ లేవు.. దిగుమతులు లేవు. ఆ తర్వాత కార్యకలాపాలు క్రమంగా మెరుగు పడుతున్నాయి. అయితే ధరలు ఓ సమయంలో రూ.56,200 స్థాయికి వెళ్లాయి. ఏడాది ప్రారంభంలో రూ.40వేల దిగువన ఉన్న పసిడి ధరలు రూ.16వేలకు పైగా పెరగడంతో కొనుగోళ్లు తగ్గి దిగుమతులపై ప్రభావం పడింది. అయితే ఆల్ టైమ్ గరిష్టంతో ప్రస్తుతం రూ.6వేలకు పైగా ఉన్నాయి. ధరలు రూ.50వేలకు సమీపంలో ఉన్నాయి. సేల్స్ కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి.

బంగారం దిగుమతులు ఇలా..
కరోనాకు తోడు, ధరలు పెరగడంతో సేల్స్‌పై ప్రభావం పడి, బంగారం దిగమతులు తగ్గాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ - నవంబర్ కాలంలో దిగుమతులు 20.6 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది అదే కాలంలో 12.3 బిలియన్ డాలర్లకు తగ్గింది. అయితే నవంబర్ నెలలో మాత్రం దిగుమతులు పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన గత నెలలో 2.65 శాతం పెరిగి 3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.

వెండి దిగుమతులు భారీగా డౌన్
ఏప్రిల్ - నవంబర్ కాలంలో వెండి దిగుమతులు 65.7 శాతం క్షీణించి 752 మిలియన్ డాలర్లకు తగ్గాయి. బంగారం, వెండి దిగుమతులు పడిపోవడంతో దేశ వాణిజ్య లోటుకు ప్లస్ అయింది. ఈ ఎనిమిది నెలల కాలంలో వాణిజ్య లోటు 42 బిలియన్ డాలర్లుగా ఉండగా, గత ఏడాది ఇదే సమయంలో 113.42 బిలియన్ డాలర్లుగా నమోదయింది. ప్రతి ఏడాది దాదాపు 800 నుండి 900 టన్నుల బంగారం మన దేశంలోకి దిగుమతి అవుతుంది.

జెమ్స్, జ్యువెల్లరీ 44% డౌన్
ఇదిలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల కాలంలో జెమ్స్, జ్యువెల్లరీ ఎగుమతులు 44 శాతం మేర క్షీణించి 14.30 బిలియన్ డాలర్లకు తగ్గింది. కరోనా కారణంగా బంగారం, వెండి సహా అన్ని ఉత్పత్తుల దిగుమతులు, ఎగుమతులపై భారీ ప్రభావం పడింది.


Click it and Unblock the Notifications