భారీగా పెరిగిన బంగారం ధరలు, కారణాలివే.. హైదరాబాద్‌లో ఎంతంటే?
కరోనా మహమ్మారి కేసుల సంఖ్య పెరగడం, అమెరికా అధ్యక్షులు డొనాల్ట్ ట్రంప్ దంపతులకు కూడా పాజిటివ్ రావడంతో బంగారం ధరలపై ప్రభావం పడింది. పసిడి ధర 1,900 డాలర్లు దాటింది. స్పాట్ గోల్డ్ ఔన్స్ 1,913 డాలర్లకి చేరుకుంది. దీంతో దేశీయ మార్కెట్లోను పసిడి ధరలు పెరిగాయి. 10 గ్రాముల పసిడి రూ.500కు పైగా పెరిగి రూ.51,000 సమీపానికి చేరుకుంది. కిలో వెండి దాదాపు వెయ్యి రూపాయల వరకు పెరిగి రూ.60,900కు చేరుకుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆరు నెలలుగా పసిడి ధరలు ఎగిసిపడుతున్నాయి. ఆగస్ట్ వరకు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న పసిడి, ఆ తర్వాత క్షీణించింది. అయినప్పటికీ ఈ క్యాలెండర్ ఏడాదిలో దాదాపు 30 శాతం పెరిగాయి.

పసిడి లోహంపై ఒత్తిడి
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు గత పది రోజుల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదు చేశాయి. 1,850 డాలర్ల నుండి 1,900 డాలర్ల పైన పలికింది. పలు దేశాలు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించడంతో ఈఏడాది పసిడి ధరలు పెరిగాయి. అయితే ఆగస్ట్ నుండి డాలర్ బలోపేతం కావడం, ఆర్థిక రికవరీ క్రమంగా మెరుగుపడుతుండటంతో పసిడి ధరలు క్షీణించాయి. అయితే అమెరికా ఆర్థిక ప్యాకేజీపై అస్పష్టత, ట్రంప్‌కు కరోనా, కేసులు పెరగడం తిరిగి పసిడి లోహంపై ఒత్తిడిని పెంచుతోంది.

మొన్నటి వరకు తగ్గి...
రెండు రోజుల క్రితం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు 0.6 శాతం క్షీణించి 10 గ్రాములు రూ.50,300 పైన పలికింది. వెండి ఫ్యూచర్స్ 0.25 శాతం పెరిగి కిలో రూ.60,055 పలికింది. అంతకుముందు సెషన్‌లో కూడా ధరలు తగ్గాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతుండటంతో దేశీయ మార్కెట్లో పెరుగుదలను నమోదు చేస్తున్నాయి. ఎంసీఎక్స్‌లో బంగారం మద్దతు ధర 49,200, నిరోధకస్థాయి 51,120 వద్ద ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

బంగారం ధరలు..
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరగడంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో శనివారం 10 గ్రాముల పసిడి రూ.52,760కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి రూ.48,370 పలికింది. వెండి ధరలు కిలో రూ.61వేలకు చేరుకున్నాయి. శుక్రవారం ధరలతో పోలిస్తే రూ.500కు పైగా పెరిగాయి.


Click it and Unblock the Notifications