భారీగా పెరిగిన బంగారం, రూ.41,730కి చేరిన ధర: మూడ్రోజుల్లో ఎంత పెరిగిందంటే?
అమెరికా - ఇరాన్ మధ్య తీవ్రఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, క్రూడాయిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా, సోమవారం బంగారం ధరలు జీవన కాల గరిష్టానికి చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే రూ.720 పెరగడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.41,730కి చేరుకుంది. తద్వారా లైఫ్ టైమ్ హైకి చేరుకుంది. వెండి ధర కూడా రూ.1,105 పెరిగి కిలో వెండి రూ.49,430 పలికింది.
భారత మార్కెట్లపై అమెరికా - ఇరాన్ ఎఫెక్ట్
గత మూడు సెషన్లలో బంగారం ధర ఏకంగా రూ.1,800కు పైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం, వెండి, పల్లాడియం ధరలు భారీగా పెరిగాయి. కమోడిటీ ఎక్స్చేంజీలో ఔన్స్ బంగారం ధర 2.3 శాతం పెరిగింది. డాలరుతో రూపాయి మారకం విలువ క్షీణించడం, అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల ధరలు పెరుగుతున్నాయి.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3 శాతం పెరిగి రూ.37,411కు చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.40,842 కు చేరుకుంది. దీనికి జీఎస్టీ అదనం. 18 క్యారెట్ల బంగారం ధర రూ.30,632కు చేరుకుంది. దీనికి కూడా జీఎస్టీ అదనం.
2020లో మొదటి ఐదు రోజుల్లో బంగారం ధర రూ.1,607 పెరిగింది. ఇందులో ఎక్కువగా ధర జనవరి 3న ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ హతమయ్యాకే పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర ఏడెళ్ల గరిష్టానికి చేరుకుంది. అంతకుముందు ఏప్రిల్ 10, 2013లో ఉంది.


Click it and Unblock the Notifications