తగ్గిన బంగారం ధరలు, ఐనా రూ.50,000 మార్క్ దిశగా బంగారం పరుగు!
బంగారం ధరలు 10 గ్రాములు రూ.50,000 మార్క్ దిశగా వేగంగా పయనిస్తుందా? అంటే అవుననే అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా ఎక్కువమంది భావిస్తున్నారు. గత ఏడాది కాలంలో బంగారం ధర దాదాపు 40 శాతం పెరిగింది. కరోనా కారణంగా దేశీయంగా, అంతర్జాతీయంగా గతంలో ఎప్పుడూ లేనంత వేగంగా ధరలు పెరుగుతున్నాయి.

బంగారం వైపు చూపు
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 2001లో ఔన్స్‌కు 255 డాలర్లు ఉంది. పదేళ్లు తిరిగేసరికి 2011లో 1,900 డాలర్ల మార్క్ దాటింది. ఆ తర్వాత క్రమంగా తగ్గినప్పటికీ మళ్ళీ గత ఏడెనిమిది నెలల కాలంగా బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక ముందు కూడా ఎక్కువ మంది సురక్షిత బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

దేశీయ మార్కెట్లో..
ఇదిలా ఉండగా బంగారం ధరలు దాదాపు వారం తర్వాత నిన్న స్వల్పంగా దిగి వచ్చాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర నిన్న రూ.250 తగ్గింది. అయినప్పటికీ రూ.47,000 మార్క్ పైనే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రూ.330 తగ్గి రూ.46,530 పలికింది. అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా దుకాణాలు బంద్ ఉన్నాయి.
ఇక, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర 0.23 శాతం క్షీణించి రూ.46,056 పలికింది. అంతకుముందు సెషన్లో రూ.800 పెరిగింది.

రూ.50వేల మార్క్ దాటే అవకాశం
బంగారం ధరలు ఈ దీపావళి నాటికి లేదా ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాములకు రూ.50,000 నుండి రూ.52,000 మధ్యకు చేరుకుంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ధరలు కూడా స్వల్పంగా తగ్గుతూ.. అధికంగా పెరుగుతూ సామాన్యులకు షాకిస్తున్నాయి. రానున్న ఐదారు నెలల కాలంలో బంగారం రూ.50 వేల మార్క్ దాటే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో 1800
అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఏడేళ్ల గరిష్టాన్ని తాకాయి. బంగారం ధర ఔన్స్ 1,700 మార్క్ దాటింది. ఏప్రిల్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ 1,747 పలికింది. 2012 నవంబర్ ఇదే మొదటిసారి. బంగారం ఇప్పటికే రికార్డ్ దిశగా వెళ్తోంది. తదుపరి 1,800కు త్వరలో చేరుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

నెల రోజుల్లో ఎంత పెరిగిందంటే
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గత నెల రోజుల్లో 56 డాలర్లకు (3.43%) పైగా పెరిగింది. ఆరు నెలల కాలంలో 244 డాలర్లకు (16.73%) పైగా, ఏడాదిలో 422 డాలర్లకు (33.01%) పైగా, అయిదేళ్లలో 515 డాలర్లకు (43.40%) పైగా పెరిగింది. ఇక, ఈ ఇరవై ఏళ్లలో అంటే 2,000 సంవత్సరం నుండి 1,415 డాలర్లు లేదా 491 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications