బంగారం ధరల్లో క్షీణత కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గడంతో ఆ ప్రభావం మనపై కూడా పడింది. మంగళవారం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX) గోల్డ్ ఫ్యూచర్స్ అక్టోబర్ 5 డెలివరీ 10 గ్రాములు 0.53 శాతం లేదా రూ.272 క్షీణించి రూ.50,793 పలికింది. ఓ సమయంలో రూ.50,650కి క్షీణించింది. ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ (డిసెంబర్ 4) 1.36 శాతం లేదా రూ.931 తగ్గి కిలో రూ.67,340కి చేరుకుంది. అంతకుముందు సెషన్‌లో రూ.68,271 వద్ద క్లోజ్ అయింది. వెండి ధర రూ.931 తగ్గింది.

రూ.5500 తగ్గిన బంగారం, రూ.11వేలు తగ్గిన వెండి
ఆగస్ట్ 7వ తేదీన ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ.56,200కు పైన పలికింది. ఈ నెల రోజుల్లో పసిడి ధర దాదాపు రూ.5,500 తగ్గింది. అలాగే వెండి కిలో గరిష్ట ధర రూ.77వేల పైకి చేరుకుంది. తాజా తగ్గుదలతో రూ.11వేల వరకు తగ్గుదలను నమోదు చేసింది. రష్యా వ్యాక్సీన్ నేపథ్యంలో పసిడి, వెండి ధరలు తగ్గుతున్నాయి. ప్రారంభంలో వేగంగా తగ్గినప్పటికీ, ఆ తర్వాత పసిడి దాదాపు స్థిరంగా ఉన్నాయి. రూ.50వేల పై నుండి రూ.52వేల దిగువన ట్రేడ్ అవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా క్షీణించిన ధర
అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో పసిడి ధర ఔన్స్ 1.13 శాతం క్షీణించి 1,912.40 డాలర్లకు చేరుకుంది. వెండి ఔన్స్ ధర 26.32 డాలర్లకు పడిపోయింది. అంతకుముందు సెషన్‌తో పోలిస్తే వెండి కిలో 1.46 శాతం క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో పసిడి ధర ఔన్స్ 2072 పైకి చేరకుంది. ఆ ధరతో పోలిస్తే 160 డాలర్ల మేరక్షీణించింది.

స్పాట్ గోల్డ్ ధర..
దేశీయ స్పాట్ గోల్డ్ విషయానికి వస్తే.. ఇండియా బులియన్ అండ్ జ్యువెల్లరీ అసోసియేషన్ ప్రకారం 10 గ్రాముల 999 ప్యూరిటీ పసిడి ధర రూ.51,075, 995 ప్యూరిటీ పసిడి 50,870, 916 ప్యూరిటీ పసిడి రూ.46,785 వద్ద క్లోజ్ అయింది. కిలో వెండి రూ.64,825 వద్ద ముగిసింది. అయితే వీటికి జీఎస్టీ అదనం.

పెరిగిన డాలర్ వ్యాల్యూ
సిక్స్ కరెన్సీ బాస్కెట్‌లో డాలర్ విలువ 0.45 శాతం పెరిగింది. దీంతో ఇతర కరెన్సీల్లో బంగారం ఖరీదుగా మారుతుంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం కూడా బంగరంపై ఒత్తిడిని తగ్గించిందని అంటున్నారు. ఈక్విటీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, భారత్, చైనా వంటి ప్రధాన మార్కెట్లలో వినియోగదారుల డిమాండ్ బలహీనపడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

హైదరాబాద్, విజయవాడల్లో ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.53,300, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,850 వద్ద ట్రేడ్ అయింది. ఢిల్లీలో మాత్రం పసిడి ధర స్వల్పంగా రూ.150 పెరిగింది. 22 క్యారెట్ల పసిడి రూ.49,800, 24 క్యారెట్ల పసిడి రూ.54,310కి చేరుకుంది.


Click it and Unblock the Notifications