ఒక్క నిర్ణయంతో మారిన లెక్కలు! 15% సుంకంతో సామాన్యుడికి అందనంత దూరంలో బంగారం!
భారతదేశంలో పసిడి ధరలు సామాన్యులకు మరింత భారంగా మారనున్నాయి. కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి , ఇతర విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని (Customs Duty) 6 శాతం నుండి ఏకంగా 15 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మే 13 నుండి అమల్లోకి రావడంతో, దేశీయంగా బంగారం (Gold) డిమాండ్ ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 10 శాతం వరకు పడిపోయే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ఆందోళన వ్యక్తం చేసింది.

జ్యువెలరీ వ్యాపారంపై దెబ్బ
IBJA జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ, ఈ సుంకాల పెంపు వల్ల జ్యువెలరీ వ్యాపారం 5 నుంచి 7 శాతం మేర తగ్గుతుందని, మొత్తం మీద డిమాండ్ 10 శాతం వరకు పడిపోవచ్చని తెలిపారు. పెరిగిన ధరల వల్ల కొనుగోలుదారులు వెనకడుగు వేస్తారని, ఇది మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం, దిగుమతి సుంకం ప్రతి 1 శాతం పెరిగితే, సుమారు 6.4 టన్నుల వినియోగదారుల డిమాండ్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు పెంచిన 9 శాతం సుంకం వల్ల ఏటా 57 టన్నుల డిమాండ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
స్మగ్లింగ్ పెరిగే ప్రమాదం
ఈ నిర్ణయం వల్ల మరో పెద్ద ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగుమతి సుంకం భారీగా ఉండటంతో అక్రమ రవాణా (Smuggling) పెరిగే అవకాశం ఉందని మెహతా ఆవేదన వ్యక్తం చేశారు. ఇది నిజాయితీగా వ్యాపారం చేసే వారికి నష్టం కలిగిస్తుందని, దొంగదారిలో వచ్చే బంగారానికి మార్కెట్‌లో డిస్కౌంట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కేవలం రూపాయి విలువను కాపాడటానికి, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడానికి కేంద్రం ఈ అడుగు వేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉండేలా కనిపిస్తున్నాయి.
MCX లో పసిడి పరుగు
కేంద్రం నిర్ణయం వెలువడిన వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. మే 13 ఉదయం ట్రేడింగ్‌లో జూన్ డెలివరీ బంగారం ధర 6.03 శాతం పెరిగి 10 గ్రాములకు రూ. 1,62,700 కు చేరింది. వెండి ధర కూడా కేజీకి రూ. 2,97,013 వద్ద ట్రేడ్ అయింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, మన దేశంలో కస్టమ్స్ డ్యూటీ పెరగడం వల్లే ఈ స్థాయిలో ధరలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతానికి ప్రభుత్వం తన విదేశీ చెల్లింపుల లోటును (Current Account Deficit) తగ్గించుకోవడానికి బంగారం (Gold) దిగుమతులపై ఆంక్షలు విధించింది. అయితే, దీనివల్ల సామాన్యుడు తులం బంగారం కొనాలన్నా లక్షల్లో వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక ధరల వల్ల ప్రజలు కొత్త బంగారం కొనడానికి బదులు, తమ దగ్గర ఉన్న పాత బంగారంపై రుణాలు (Gold Loans) తీసుకోవడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో పసిడి మార్కెట్ ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటుందో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications