2025 నాటికి భారత ఆర్థిక వ్యవస్థను రూ.5 లక్షల కోట్లస్థాయికి తీసుకు వెళ్లాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కరోనా మహమ్మారి రూపంలో ఇప్పుడు అడ్డంకి వచ్చి పడింది. దీనిని అధిగమించి ముందుకు సాగుతామని, అయితే కొంత ఆలస్యం కావొచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ కేవీ సుబ్రమణియన్ భారతీయ బ్యాంకుల గురించి మాట్లాడారు.

5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే
2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మరిన్ని ప్రపంచస్థాయి బ్యాంకులు మనకు అవసరమని కేవీ సుబ్రమణియన్ అన్నారు. అగ్రగామి 100 అంతర్జాతీయ బ్యాంకుల జాబితాలో కేవలం ఒక్క ఇండియన్ బ్యాంకు మాత్రమే ఉందని గుర్తు చేశారు. చిన్న దేశాల్లో కూడా పెద్ద బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయన్నారు.

చిన్న దేశాలకూ ప్రపంచస్థాయి బ్యాంకులు
ప్రపంచ టాప్ 100 బ్యాంకుల జాబితాలో ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) 55వ స్థానంలో ఉంది. ఇందులో 18 చైనా బ్యాంకులు, 12 అమెరికా బ్యాంకులు ఉన్నాయి. ఇతర చిన్న దేశాల (ఫిన్‌లాండ్, డెన్మార్క్, బెల్జియం, ఆస్ట్రియా, నార్వే) బ్యాంకులు కూడా ఉన్నాయి. కానీ మన దేశం నుండి మాత్రం కేవలం ఒకటి మాత్రమే ఉంది. దీనిపై కేవీ సుబ్రమణియన్ స్పందిస్తూ... ప్రపంచంలోనే మన ఆర్థిక వ్యవస్థ అయిదో అతిపెద్దదని, ఇందుకు అనుగుణంగా భారత బ్యాంకింగ్ రంగం లేదని చెప్పారు. సౌత్ కొరియాలో ఆరు ప్రపంచస్థాయి బ్యాంకులు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కటే ఉందన్నారు.

సంక్షోభాన్ని అవకాశంగా భావించాలి
మన ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే బ్యాంకింగ్ సెక్టార్ పరిధి చాలా తక్కువగానే ఉన్నట్లుగా భావించవచ్చునని సుబ్రమణియమ్ అన్నారు. కరోనా మహమ్మారి, ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల అంశం గురించి మాట్లాడుతూ... ప్రతి సంక్షోభాన్ని ఓ అవకాశంగా భావించాలని, కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను కూడా అలాగే భావించాలని సూచించారు.


Click it and Unblock the Notifications