ఉద్యోగం దొరకక... రెండు నెలల జీతం ఆఫర్ చేసిన జెన్-జీ!
భారతదేశంలో ఉద్యోగాల కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. చదువు పూర్తి చేసుకున్న యువతకు అంత సులభంగా ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేలా ఓ జెన్-జీ యువకుడు చేసిన ప్రకటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
బెంగళూరుకు చెందిన ఓ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్, తనకు ఉద్యోగం ఇప్పించిన వారికి తన రెండు నెలల జీతాన్ని పూర్తిగా ఇచ్చేస్తానని రెడ్డిట్‌లో బహిరంగంగా ప్రకటించాడు. ఈ విషయం ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు దారితీసింది.
చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం వెతుకుతున్న ఎందరో యువకుల్లాగే, ఇతను కూడా ఎన్నో కంపెనీలకు అప్లై చేశాడు. కానీ, AI స్క్రీనింగ్ ఫిల్టర్లు, తీవ్రమైన పోటీ కారణంగా కనీసం ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం లేదని వాపోతున్నాడు.

సాధారణ పద్ధతిలో అప్లై చేస్తే ప్రయోజనం లేదని, తనకు AI/ML లేదా సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగం ఇప్పించిన వారికి నా మొదటి రెండు నెలల జీతాన్ని బహుమతిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని పోస్ట్ చేశాడు. మామూలు రిఫరల్ రిక్వెస్ట్‌లను ఎవరూ పట్టించుకోకపోవడంతో, ఇలా వినూత్నంగా జీతాన్ని కమీషన్‌గా ఇస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
తనకు సరైన కాంటాక్ట్స్ లేనందున, కంపెనీలలో పలుకుబడి ఉన్నవారు లేదా సరైన ఉద్యోగావకాశాల గురించి తెలిసిన వారు తనకు సహాయం చేయాలని అతను కోరాడు. ఈ జెన్-జీ యువకుడి వింత ప్రకటన ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
ప్రస్తుత కఠినమైన జాబ్ మార్కెట్లో గ్రాడ్యుయేట్లు పడుతున్న బాధను ఇది స్పష్టంగా చూపిస్తోందని, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారు తమ నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ఎలాంటి హద్దులకైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఇది తెలియజేస్తోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, అప్పుడే చదువు పూర్తి చేసుకున్న వ్యక్తి తన మొదటి జీతాన్ని వదులుకుంటానని చెప్పడం సరైనది కాదని, సరైన నెట్వర్కింగ్, ఓపికతో ఉద్యోగం వెతుక్కోవడమే సరైన మార్గమని కొందరు విమర్శిస్తున్నారు.
అయితే, AI రాకతో ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు అంత సులభంగా దొరకడం లేదు. దీనివల్ల, ఉద్యోగం సంపాదించి ఒక కంపెనీలోకి అడుగుపెట్టడం అంత తేలికైన విషయం కాదు. ఈ యువకుడి పోస్ట్, నేటి టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోసం పోటీ ఏ స్థాయికి చేరిందో, తమ భవిష్యత్తు కోసం యువత ఎలాంటి తీవ్రమైన ప్రయత్నాలకైనా వెనుకాడటం లేదో చూపిస్తోంది.


Click it and Unblock the Notifications