చెత్త పన్నుతో రూ.350 కోట్ల వసూలు: నెలకు ఎంత కట్టాలి ? ఈ డబ్బు ఎక్కడికి పోతుంది ?
ఐటికి మహా నగరం అయిన బెంగళూరులో ఏప్రిల్ 1న ప్రవేశపెట్టిన కొత్త "చెత్త పన్ను" అనూహ్య విజయాన్ని సాధించింది. కేవలం రెండు నెలల్లోనే రూ.350 కోట్లు వసూలు అయినట్లు డెక్కన్ హెరాల్డ్ నివేదించింది. ఇది అంచనా వేసిన వార్షిక ఆదాయంలో సగం కావడం విశేషం. ఈ పన్నును ఆస్తి పన్ను బిల్లులకు కలిపిన ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management - SWM) చార్జిగా వసూలు చేస్తారు.

అంచనాలకు మించి వసూళ్లు : బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP), బెంగళూరు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML) తరపున ఈ చార్జీలు వసూలు చేస్తుంది. లెవీకి ప్రజల స్పందన అంచనాలను మించిందని BBMP తెలిపింది. మే నెలలోనే SWM యూజర్ ఫీజుల ద్వారా రూ.230 కోట్లు ఆర్జించగా ఏప్రిల్ ఇంకా మే నెలల్లో మొత్తం రూ.2,600 కోట్ల ఆస్తి పన్ను వసూలుకు ఇది దోహదపడింది.
వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుంది: బెంగళూరు నగర వ్యర్థాల నిర్వహణ సంస్థ అయిన BSWML వసూలు చేసిన డబ్బును ఉపయోగించేందుకు ఇప్పటికే ఒక ప్రతిష్టాత్మక ప్రణాళికను రూపొందించింది.
వ్యర్థాల సేకరణ, రవాణా మెరుగుదల: ఇంటింటికీ చెత్త సేకరణ కోసం అప్‌గ్రేడ్ చేసిన ఆటో-టిప్పర్‌లను మోహరించడం ఇంకా వ్యర్థ రవాణా వ్యవస్థను పునరుద్ధరించడం వంటి వాటికి నిధులు కేటాయిస్తారు.
వ్యర్థాల నిర్వహణకు ఒకే సంస్థ: అసెంబ్లీ నియోజకవర్గాల్లో తడి, పొడి ఇంకా పారిశుద్ధ్య వ్యర్థాలను నిర్వహించడానికి ఒకే ప్రైవేట్ సంస్థను నియమించాలని పౌర సంస్థ యోచిస్తోంది. ఇది ఏటా రూ.540 కోట్ల విలువైన ఒప్పందం అని నివేదిక పేర్కొంది.
కొత్త వ్యర్థాల శుద్ధి సౌకర్యాలు: బెంగళూరు నగరం నాలుగు మండలాల్లో కొత్త ఇంటిగ్రేటెడ్ వ్యర్థాల శుద్ధి సౌకర్యాలను నిర్మించాలని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.
చెత్త పన్ను ఎలా లెక్కిస్తారు, నెలకు ఎంత కట్టాలి : నివాస ఆస్తుల నిర్మాణ ప్రాంతం ఆధారంగా చెత్త పన్నును లెక్కిస్తారు. ప్రతినెలా చార్జీలు చూస్తే ఈ క్రింది విధంగా ఉంటుంది:
600 చదరపు అడుగుల వరకు: రూ.10
600 నుండి 1,000 చదరపు అడుగులు: రూ.50
1,000 నుండి 2,000 చదరపు అడుగులు: రూ.100
2,000 నుండి 3,000 చదరపు అడుగులు: రూ.150
3,000 నుండి 4,000 చదరపు అడుగులు: రూ.200
4,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ: రూ.400
చెత్త పన్ను ఉపసంహరణ డిమాండ్లు:
బెంగళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న, సాంకేతిక కేంద్రంగా ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల నిర్వహణలో స్పష్టత లేకపోవడం ఒక నిరంతర సమస్య. దీనిపై ప్రజల నుండి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. బెంగళూరు నవనిర్మాణ సేన (BNP) వంటి సంస్థలు చెత్త పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
BNP ప్రకారం, ప్రభుత్వం వీలైనంత త్వరగా పెండింగ్‌లో ఉన్న BBMP ఎన్నికలను నిర్వహించాలి. ఏదైనా కొత్త పన్నులు విధించే ముందు దానిపై పూర్తి ప్రాజెక్టు రిపోర్ట్ (DPR) ఇంకా ఆడిట్ రిపోర్ట్ బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. ఎన్నికైన ప్రతినిధులు లేకుండా విధించే ఏదైనా పన్ను ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని పార్టీ పేర్కొంది. ప్రజలపై భారం పడే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం పౌరుల అభిప్రాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ విషయంలో, BBMP వెంటనే బహిరంగ సమావేశాలు నిర్వహించి, పన్ను లాభనష్టాలను చర్చించాలని BNP డిమాండ్ చేసింది. మొత్తంగా ఏవైనా కొత్త పన్నులు BBMP ఎన్నికలు నిర్వహించి, ప్రజాభిప్రాయం పొందిన తర్వాతే విధించాలని వారు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications