ఈ నెలలో పెట్రోల్, డీజిల్ రేట్ల మోత ఎలా ఉందో తెలుసా?: హిస్టరీలోనే ఫస్ట్‌టైమ్
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరలు ఏ రేంజ్‌లో పరుగులు పెట్టాయో తెలుసు. రోజూ దీని గురించి చూస్తూనే వచ్చాం. వాటి రేట్ల పెరుగుదల ఎక్కడా ఆగలేదు. ఒకట్రెండు రోజుల గ్యాప్ ఇస్తూ.. వాహనదారులకు వాతలు పెడుతూ వచ్చాయి చమురు సంస్థలు. ఈ నెల 2వ తేదీన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయిన రెండో రోజు అంటే.. 4వ తేదీన ఆరంభమైన పెట్రోల్, డీజిల్ రేట్లు అడ్డు, అదుపు లేకుండా పెరిగాయి. మధ్య మధ్యలో కొంత విరామం ఇచ్చాయే తప్ప పెరుగుదల మాత్రం పక్కాగా కొనసాగింది.

రెండింటికీ కలిపి రూ.5.76 పైసలు..
ఇప్పటిదాకా డజనుసార్లు ఇంధన రేట్లు పెరిగాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే తొలిసారి అనే అభిప్రాయాలు ఉన్నాయి. ఈ 12 రోజుల్లో ఏకంగా రూ.5.76 పైసల మేర ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. ఇందులో పెట్రోల్ వాటా రూ.2.69 పైసలు కగా.. డీజిల్‌ది రూ.3.07 పైసలు. ఈ స్థాయిలో వరుసగా పెరుగుదల ఏ నెలలో కూడా చోటు చేసకోలేదు. ఆ వరుస పెంపుల ఫలితంగా పెట్రోల్ ధర పీక్స్‌కు వెళ్లింది. స్కై హైలో దూసుకెళ్లింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.103.80 పైసలు పలుకుతోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో 100 రూపాయల మార్క్‌ను అధిగమించింది పెట్రోల్ రేటు.

నో గ్యారంటీ..
శుక్రవారం కూడా ఇంధన ధరలు భగ్గుమంటూ మండాయి. శనివారం మాత్రం కాస్త శాంతించాయి. వాటి రేట్లలో తాజాగా ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు. ఇదే పరిస్థితి ఆదివారం కూడా కొనసాగడానికే అవకాశాలు ఉన్నాయి. సోమవారం నాడు పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగబోవనడానికి ఎలాంటి గ్యారంటీ లేదు. ఈ నెలలో ఇఫ్పటిదాకా చమురు సంస్థలు కొనసాగించిన దూకుడు, బాదుడును పరిగణనలోకి తీసుకుంటే.. మళ్లీ వాటి రేట్లు పైపైకి ఎగబాకడానికే ఛాన్స్ ఉంది.

దేశవ్యాప్తంగా తాజా రేట్లివీ..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శుక్రవారం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 29పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 19 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్-రూ.93.04, డీజిల్ 83.80 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 99.32 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 91.01 పైసలకు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 94.71, డీజిల్ ధర రూ. 88.62, కోల్‌కతలో పెట్రోల్ రూ.93.11 పైసలు, డీజిల్ ధర రూ.86.64 పైసలు పలుకుతోంది. బెంగళూరులో పెట్రోల్-96.14, డీజిల్-88.84, పుణేలో లీటర్ పెట్రోల్-98.77, డీజిల్-88.96, పాట్నాలో పెట్రోల్-95.23, డీజిల్ 89.05, చండీగఢ్‌లో పెట్రోల్-89.31, డీజిల్-83.89, లక్నోలో పెట్రోల్-90.72, డీజిల్-84.18గా నమోదైంది. భోపాల్‌లో పెట్రోల్-101 మార్క్‌ను దాటుకుంది. వంద రూపాయల మార్క్ దాటడం ఇదే తొలిసారి. హైదరాబాద్‌లో పెట్రోల్-96.50, డీజిల్-91.04, నొయిడాలో పెట్రోల్-90.66, డీజిల్-83.97, గుర్‌గావ్‌లో పెట్రోల్-90.73, డీజిల్-84.09గా నమోదైంది.

క్రూడాయిల్ రేట్లు తగ్గినా..
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బ్రెంట్ క్రూడాయిల్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ బ్యారెల్ ఒక్కింటికి 67.63 డాలర్లు పలికింది. 1.08 డాలర్ల మేర తగ్గింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్్ వద్ద కూడా క్రూడాయిల్ ఫ్యూచర్ ట్రేడింగ్‌లో క్షీణత నెలకొంది. 1.5 డాలర్ల మేర తగ్గి.. 64.44 వద్ద నిలిచింది. భారత్, తైవాన్, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి ఆసియా దేశాల్లో కరోనా వైరస్ తీవ్రతను నివారించడానికి లాక్‌డౌన్ తరహా పరిస్థితులు ఏర్పడటమే క్రూడాయిల్ ధరల తగ్గుదలకు కారణమైందని వందా ఇన్‌సైట్స్ ఎనర్జీ అనలిస్ట్ వందనా హరి తెలిపారు. అయినప్పటికీ- దేశీయంగా వాటి రేట్లు పెరగడం చర్చనీయాంశమౌతోంది.


Click it and Unblock the Notifications