పడిపోయిన పెట్రోల్, డీజిల్ డిమాండ్, ఎల్పీజీ గ్యాస్ మాత్రమే పెరుగుదల
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా మార్చి నెల నుండి ఇంధనం డిమాండ్ తగ్గిపోయింది. ఏప్రిల్, మే నెలల్లో అయితే అడగుంటింది. అన్-లాక్ కారణంగా జూన్ నెల నుండి స్వల్పంగా పుంజుకుంటోంది. అయినప్పటికీ బయటకు వెళ్లేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అవసరమైతేనే ప్రయాణాలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌కు డిమాండ్ కరోనా కంటే ముందుకు పుంజుకోలేకపోయింది.

ఆరు నుండి 9 నెలల సమయం
భారతదేశంలో ఇంధనం డిమాండ్ సాధారణ పరిస్థితికి చేరుకోవడానికి ఆరు నెలల నుండి 9 నెలల సమయం పట్టే అవకాశముందని ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ డైరెక్టర్ ఫైనాన్స్ ఎస్కే గుప్తా మంగళవారం అన్నారు. ఏప్రిల్ నెలలో ఇంధనం డిమాండ్ 45.8 శాతం మేర పడిపోయింది. అప్పుడు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంది. ఆ తర్వాత క్రమంగా లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. కేసులకు అనుగుణంగా ఆయా రాష్ట్రాలు, ఆయా నగరాలు లాక్ డౌన్ కొనసాగిస్తున్నాయి. దీంతో ఇంధనం డిమాండ్ పుంజుకోవడానికి సమయం పడుతుందని చెబుతున్నారు.

జూన్ రెండో భాగంలో మళ్లీ తగ్గుదల
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిమాండ్ రికవరీని అంచనా వేయడం కష్టమేనని చెప్పారు. సాధారణ పరిస్థితికి రావడానికి దాదాపు తొమ్మిది నెలలు పట్టవచ్చు అన్నారు. మే నెలలో స్వల్పంగా ఇంధన డిమాండ్ పెరిగినప్పటికీ జూన్ రెండో భాగం నుండి మళ్లీ పడిపోయాయి. పెట్రోలియం ఉత్పత్తిలో డీజిల్ వాటా ఐదింట రెండొంతులు. అంతకుముందు నెలతో పోలిస్తే జూలైలో డీజిల్ డిమాండ్ 13 శాతం తగ్గి 4.85 మిలియన్ టన్నులకు పరిమితమైంది. 2019 జూలైతో పోలిస్తే 21 శాతం తగ్గింది.

గ్యాస్ సిలిండర్ డిమాండ్ జూమ్
జూన్ నెలతో పోలిస్తే జూలైలో పెట్రోల్ సేల్స్ 1 శాతం పడిపోయి 2.03 మిలియన్ టన్నులుగా ఉంది. 2019 జూలైతో పోలిస్తే 11.5 శాతం తగ్గింది. జెట్ ఫ్యూయల్ సేల్స్ 4 శాతం తగ్గి 2,18,000 గా ఉండగా, 2019 జూలైతో పోలిస్తే దారుణంగా పడిపోయింది. ఏకంగా 65 శాతం క్షీణించింది. కేవలం కుకింగ్ గ్యాస్ డిమాండ్ మాత్రమే పెరుగుతోంది. జూన్ నెలతో పోలిస్తే జూలైలో 10 శాతం పెరిగి 2.27 మిలియన్ టన్నులుగా ఉంది. 2019 జూలైతో పోలిస్తే 3.5 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications