అమెరికాకు ఇండియాకు ఉన్న తేడా ఇదే.. నాలుగేళ్ల క్రితం యుఎస్ వదిలి భారత్‌కు వచ్చిన ప్రొఫెషనల్ మాటల్లో..
అమెరికాలో 15 సంవత్సరాలు పనిచేసి స్థిరమైన జీవితం గడిపిన ఒక భారతీయ ప్రొఫెషనల్, నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న కీలక నిర్ణయం గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చకు వేదికగా మారింది. అతను 2019లో అమెరికాను వదిలి కుటుంబంతో కలసి ఇండియాకు తిరిగి వచ్చాడు. చాలా మంది ఆ సమయంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. అమెరికాలో స్థిరమైన ఉద్యోగం, ఆర్థిక సౌలభ్యం, ఉన్నతమైన ఆరోగ్య సేవలు, సౌకర్యవంతమైన జీవన విధానం వీటిని వదిలేసి మూర్ఖుడిలా భారత్ కు ఎందుకు వెళుతున్నావని ప్రశ్నించారు. అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల పదే పదే అతని నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు.
అతను మాత్రం వాటిని ఏమి పట్టించుకోకుండా US వదిలి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిచినా.. తిరిగి అమెరికాకు వెళ్ళాలనే ఆలోచన తనకు ఒక్కసారైనా రాలేదని పోస్టు ద్వారా తెలిపారు. త న పోస్ట్‌లో అమెరికా, భారతదేశ జీవన విధానాల మధ్య తేడాలను చాలా లోతుగా విశ్లేషించాడు. అమెరికాలో జీవితం సౌకర్యవంతమైనదే అయినా.. ఒకేలా పునరావృతమయ్యే గమనం ఉన్నట్టు అనిపించేదని చెప్పాడు. అయితే భారతదేశంలో ప్రతిరోజూ కొత్త సవాళ్లు, కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఈ చైతన్యం, డైనమిక్ వాతావరణం తనను మరింత ఉత్సాహభరితమైన జీవితానికి నడిపించిందన్నాడు.

అమెరికాలో పెరుగుతున్న జీవన వ్యయం కూడా అతని తీసుకున్న నిర్ణయానికి ముఖ్య కారణమైంది. అద్దెలు, ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, రోజువారీ అవసరాలు ఇవన్నీ అతనికి భారంగా పరిణమించాయి. దీని వల్ల అతను సేవింగ్ చేయడం కూడా కష్టమైపోయింది. అయితే భారతదేశంలో ద్రవ్యోల్బణం ఉందని ఆయన అంగీకరించాడు. ఇక్కడ తనకు ఏదైనా నిర్మించుకోవడానికి, కొత్తగా ప్రారంభించడానికి ఎక్కువ స్థలం, స్వేచ్ఛ ఉందని నమ్ముతున్నాడు.
వ్యాపార అవకాశాల విషయానికి వస్తే.. భారతదేశంలో స్టార్టప్ కల్చర్ గణనీయంగా పెరిగిందని, చిన్న వ్యాపారం నుండి పెద్ద స్థాయి ఆవిష్కరణల వరకు అనుకూల వాతావరణం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో పోలిస్తే ఇక్కడ ప్రవేశ అడ్డంకులు తక్కువగా ఉండటం వల్ల, ఎంట్రప్రెన్యూర్షిప్ వైపు తన అడుగులు వేయడానికి మరింత సులభమైందని చెప్పుకొచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత తాను ప్రారంభించిన స్టార్టప్ ఇప్పటివరకు తనకు సానుకూల అనుభవాన్ని ఇచ్చిందని వెల్లడించారు.
కుటుంబ జీవితంపై మాట్లాడినప్పుడు.. గత దశాబ్దంలో భారతీయ పాఠశాలల నాణ్యత గణనీయంగా మెరుగైందన్నాడు. ఏ విద్యావ్యవస్థ పరిపూర్ణం కాదని అంగీకరించినా.. తన పిల్లలకు ఇక్కడ లభిస్తున్న అవకాశాలు సంతృప్తిని కలిగిస్తున్నాయన్నాడు. అలాగే, అమెరికాలో సామాజిక ఒత్తిడులు తరచూ అనుభవించాల్సి వచ్చేదని బాధపడ్డారు. సాంస్కృతికంగా సరిపోయేలా ఉండాలని ఒక మౌన ఒత్తిడి ఉండేదని తెలిపాడు. భారతదేశంలో మాత్రం అలాంటి తీర్పు లేదా ప్రతికూల అనుభవం తక్కువగా ఉండటంతో, తాను వ్యక్తిగతంగా మరింత స్వేచ్ఛగా ఉన్నానని తెలిపారు.
ట్రాఫిక్ సమస్యలు, నెమ్మదిగా పనిచేసే అధికార వ్యవస్థ, అవినీతి భారతదేశంలో సమస్యగా మారుతున్నాయని తెలిపారు. అదే అమెరికాలో పెరుగుతున్న ఖర్చులు, పరిమితమైన పొదుపు అవకాశాలు కలిగించే ఒత్తిడితో పోలిస్తే ఈ సవాళ్లను ఎదుర్కోవడం తనకు, తన కుటుంబానికి ఆమోదయోగ్యమని చెప్పుకొచ్చారు. క్లుప్తంగా ఆయన మాటల్లో చెప్పాలంటే.. భారతదేశానికి తిరిగి రావడం తన జీవితంలో తీసుకున్న ఉత్తమ నిర్ణయాలలో ఇది ఒకటని తెలిపారు. నాలుగేళ్లుగా తనకు వెనక్కి వెళ్లాలనే ఆలోచన రాకపోవడంతో సరైన నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.


Click it and Unblock the Notifications