షాకింగ్ న్యూస్: అమ్మకానికి 5 లక్షల క్రెడిట్ కార్డుల డేటా!
సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఇండియన్ బ్యాంకులు జారీ చేసిన సుమారు 5 లక్షల క్రెడిట్ కార్డుల వివరాలను అమ్మకానికి పెట్టారు. ఈ వ్యాపారం ఒక మాఫియా లా తయారైంది. వినియోగదారుల నుంచి అనేక మార్గాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకు వివరాలు సేకరించటం, వాటిని డార్క్ నెట్ లలో అమ్మకానికి ఉంచటం రివాజుగా మారిపోయింది. ఈ డాటాను కొనుగోలు చేసే గ్యాంగ్ మరోటి ఉంటుంది.
కార్డు వివరాల ఆధారంగా వినియోగదారుల కార్డుల నుంచి, బ్యాంకు ఖాతాల నుంచి నగదు మాయం చేసి, కోట్లకు కోట్లు కూడబెట్టేస్తున్నారు. కస్టమర్ల కు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గ్యాంగులు పనిచేస్తున్నా... భారతీయ బ్యాంకులు జారీ చేసిన కార్డుల వివరాలు చాలా సులభంగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కటం ఆందోళన కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా కార్డుల డేటా లో సివీవీ నెంబర్ కూడా ఉండటం హడలెత్తిస్తోంది. ఇక సైబర్ నేరగాళ్లకు కావాల్సింది కేవలం ఒక ఓటీపీ మాత్రమే. కొన్ని అంతర్జాతీయ వెబ్సైట్ల లో కార్డు ఉపయోగించినప్పుడు ఓటీపీ అవసరం కూడా ఉండదు.

98% ఇండియన్ కార్డులే ...
సింగపూర్ కు చెందిన గ్రూప్ ఐబీ అనే సైబర్ సెక్యూరిటీ కంపెనీ ప్రకారం... తాజాగా మరో 4,61,976 పేమెంట్ కార్డులు (క్రెడిట్, డెబిట్ కార్డులు) అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ కార్యకలాపాలు సాగించే జోకర్స్ స్టాష్ అనే వెబ్సైటు లో ఈ వివరాలు అప్లోడ్ చేశారు. ఫిబ్రవరి 5 నుంచి ఈ కార్డుల వివరాలు అమ్మకానికి ఉంచారు. ఇందులో 98% కార్డులు ఇండియన్ బ్యాంకులు జారీ చేసినవేనని గ్రూప్ ఐబీ గుర్తించింది. మొత్తం సమాచారంలో 80-85% వాలిడ్ డేటాబేస్ ఉన్నట్లు సమాచారం. ఈ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక కథనాన్ని ది ఎకనామిక్ టైమ్స్ ప్రచురించింది. నాన్ రేఫండబుల్ (తిరిగి చెల్లించని విధానం) కార్డుల వివరాలను కొనుగోలు చేయవచ్చు.

రూ 630 కి ఒక కార్డు...
అనేక మార్గాల నుంచి సేకరించిన పేమెంట్ కార్డుల వివరాలను కారు చవకగా విక్రయించేందుకు వెనకాడరు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఒక్కో కార్డు వివరాలను 9 డాలర్లకు (సుమారు రూ 630) అమ్మకానికి పెట్టారు. ఈ కార్డుల అన్నింటి విలువ సుమారు రూ 30 కోట్ల వరకు ఉంటుందని సింగపూర్ సంస్థ అంచనా వేస్తోంది. అయితే ఇప్పటివరకు కేవలం 16 కార్డుల వివరాలు మాత్రమే విక్రయమైనట్లు గుర్తించారు. ఇలాంటి కార్డుల వివరాలు కొనుగోలు చేసే వారు తప్పకుండ ఆయా కార్డుల నుంచి దొంగతనంగా రూ వేలు, రూ లక్షలు కాజేస్తారు. ఎక్కడెక్కడో విదేశాల్లో చేసే లావాదేవీలకు వినియోగదారులు ఇక్కడ బలైపోతారు.

భారత్ ను అలెర్ట్ చేసిన సింగపూర్ సంస్థ...
గత ఏడాది అక్టోబర్ లోనే మొదటి సారి 13 లక్షల కార్డుల వివరాలు జోకర్స్ స్టాష్ లో అప్లోడ్ చేశారు. మళ్ళీ ఆరు నెలలైనా గడవక ముందే మరో 5 లక్షల కార్డుల వివరాలు నెట్టింట్లో దర్శనం ఇచ్చాయి. ఇండియాలో నోట్ల రద్దు అనంతరం క్రెడిట్, డెబిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కానీ అంతే వేగంగా సైబర్ సెక్యూరిటీ కి సంబంధించిన నిబంధనలు, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు. లేదా మన దేశం వాటిపై అంతగా శ్రద్ధ చూపలేదు. దాంతో సైబర్ నేరగాళ్లకు కార్డు వివరాల తస్కరణకు ఇండియా ప్రధాన కేద్రంగా మారిపోతోందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత డేటా లీక్ తర్వాత ... ఇండియా లోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్ టీ - ఐఎన్) ను అప్రమత్తం చేసినట్లు గ్రూప్ ఐబీ వెల్లడించింది. దీంతో, తగిన చర్యలు తీసుకునేందుకు భారత్‌కు మార్గం సగం అవుతుంది.


Click it and Unblock the Notifications


