Telangana: తెలంగాణలో ఫాక్స్ కాన్ భారీ పెట్టుబడులు.. పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనకు హామీ
Telangana: విశ్వనగరంగా హైదరాబాద్ సత్తా మనందరికీ తెలిసిందే. CM కేసీఆర్, IT మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సైతం భాగ్యనగరం వైపు చూస్తున్నాయడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆయా కంపెనీలు వారి ప్రధాన కార్యాలయాలను ఇక్కడ నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. తాజాగా ఫాక్స్ కాన్ సైతం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.

10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు:
తైవాన్ కి చెందిన ఫాక్స్ కాన్ కంపెనీ ఛైర్మన్ యంగ్ లియు తన బృందంతో సహా CM కేసీఆర్ ను కలిశారు. తమ సంస్థ తయారీ యూనిట్ ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి చూస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. యాపిల్ ఫోన్స్ సహా అనేక ఇతర ఎలక్ట్రానిక్స్, మొబైల్ కంపెనీలకు అవసరమైన పరికరాలను ఇక్కడ తయారు చేయనున్నట్లు తెలిపారు. రానున్న 10 ఏళ్లలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్ష ఉద్యోగాలు సృష్టించనున్నట్లు వెల్లడించారు.

స్థానిక యువతకు ప్రాధాన్యం:
భారత్ లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు ఫాక్స్ కాన్ యాజమాన్యానికి CM కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థను సాధరంగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీల స్థాపనను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో పటిష్ఠమైన వ్యవస్థను సృష్టించినట్లు వెల్లడించారు. బంగారు తెలంగాణను సాకారం చేసుకునేందుకు పలు భారీ ప్రాజెక్టులను చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే ఉపాధి కల్పనలో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని సంస్థ యాజమాన్యాన్ని కోరారు.

తెలంగాణ ప్రగతి భేష్:
తెలంగాణ పారిశ్రామిక విధానం, ప్రభుత్వం రూపొందించిన స్నేహపూర్వక పర్యావరణ వ్యవస్థ ను లియు అభినందించారు. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన 8 ఏళ్ల స్వల్ప వ్యవధిలోనే IT, ఎలక్ట్రానిక్స్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై తమ కంపెనీ వివరణాత్మక అధ్యయనం చేసిందన్నారు. అన్నింటినీ పరిగణలోనికి తీసుకున్న అనంతరం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. హైదరాబాదులో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications