nps: వేతన జీవుల దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఉద్యోగులకు పెన్షన్ అనే కాన్సెప్ట్ వెలుగులోకి వచ్చింది. గతంలోని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (OPS) స్థానంలో కొత్తగా నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. వీటిపై గత కొంతకాలంగా వివాదాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అయితే NPS నిధుల విషయమై మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ కీలక ప్రకటన చేశారు.

చట్టాలు అంగీకరించవు:
జాతీయ పెన్షన్ స్కీమ్ (NPS) కింద ఉద్యోగులు జమచేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న చట్టాలు అందుగు అంగీకరించవని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బడ్జెట్ అనంతరం వ్యాపార వర్గాలతో చర్చల సందర్భంగా.. కేంద్ర ఆర్థిక కార్యదర్శి వివేక్ జోషితో కలిసి ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాష్ట్రాలు OPS వైపు మళ్లుతున్నాయని, ఈ ధోరణి మంచిది కాదని సూచించారు.

అదానీ సంక్షోభాన్ని ఉటంకిస్తూ..
అదానీ గ్రూపు కంపెనీల షేర్లలో ఇటీవల ఏర్పడిన సంక్షోభంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఇటీవల స్పందించారు. ఉద్యోగుల జీతాల నుంచి NPS కింద కట్ చేస్తున్న నిధులను స్టాక్ మార్కెట్ లో పెట్టి నష్టపోలేమన్నారు. ఈ పథకం కింద జమ అయిన ప్రభుత్వ ఉద్యోగుల నిధులు తిరిగి రాష్ట్రాలకు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. వాటిని OPSకి బదిలీ చేయకపోతే సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఆ వ్యాఖ్యలకు మంత్రి నిర్మలా సీతారామన్ పైవిధంగా ఇప్పుడు సమాధానమిచ్చారు.

అది అసాధ్యం:
"NPS ద్వారా EPFOలో జమ చేసిన నిధులపై ఉద్యోగులకు మాత్రమే హక్కు ఉంటుంది. ఆ డిపాజిట్ డబ్బుకు వడ్డీ వస్తుంది. పదవీ విరమణ అనంతరం అవి వారి చేతికి అందుతాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు తమ చేతుల్లోకి తీసుకోవాలని భావిస్తున్నాయి. అది జరగడం అసాధ్యం" అని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ తరహా ధోరణి మంచిది కాదని, ఉద్యోగులకు మేలు జరుగుతుందా లేదా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని వివేక్ జోషి కోరారు. NPS విషయంలో చట్టం చాలా స్పష్టంగా ఉందని గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications