Flipkart: ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు తమ ఖర్చుల తగ్గింపుల కోసం అనేక మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో వాల్ మార్ట్ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్ సైతం వేల మంది ఉద్యోగులను పీకేస్తుందంటూ వార్తలు వెలువడ్డాయి. ఇవి కొంత మేర ఆందోళనలకు కారణమయ్యాయి. అయితే తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం చీఫ్ పీపుల్ ఆఫీసర్ దుమారంపై స్పష్టత ఇచ్చారు.
ఉద్యోగాల కోతలు విపరీతంగా మారిన తరుణంలో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 'మాస్ లేఆఫ్‌లకు నో' చెప్పాలని నిర్ణయించుకుంది. ఉద్యోగులను తొలగించే ఉద్దేశం కంపెనీకి లేదని చీఫ్ పీపుల్ ఆఫీసర్ కృష్ణ రాఘవన్ వెల్లడించారు. పెద్దమెుత్తంలో ఉద్యోగులను నియమించుకోవటం.. ఆ తర్వాత వారిని తొలగింటే పద్ధతిపై తమకు నమ్మకం లేదని అన్నారు.

కంపెనీ అవసరాల మేరకు బాధ్యతాయుతంగానే నియామకాలు చేస్తామని.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తొలగింపులు జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. స్టాక్ ఆప్షన్ బైబ్యాక్ ప్లాన్‌తో పాటు గత సంవత్సరం పెంపు, ప్రమోషన్లు జరిగినందున సీనియర్ మేనేజ్‌మెంట్‌కు ఇంక్రిమెంట్స్ ఇవ్వకూడదని ఫ్లిప్‌కార్ట్ తీసుకున్న నిర్ణయం ఎటువంటి ఉద్యోగాలపై ప్రభావం చూపదని వెల్లడైంది. పరిశ్రమలోని ఇతరులతో పోలిస్తే కంపెనీ తన అంతర్గత ఉద్యోగ పోస్టింగ్‌ను పెంచిందని రాఘవన్ తెలిపారు.
అమెజాన్ ఇటీవల తన ఆపరేటింగ్ ప్లాన్ రెండవ దశలో భాగంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించుకున్న సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఈ ప్రకటన చేసింది. దీనికి ముందు జనవరిలో అమెజాన్ దాదాపు 18,000 మంది ఉద్యోగులను తొలగించింది. మరోవైపు ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కూడా 19,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించటంతో ఇంకా ఎంతకాలం జాబ్ ఫైరింగ్స్ కొనసాగుతాయోనని ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications