ఆ ఒక్క నెలలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయి, ఆందోళనకరమే!
కరోనా మహమ్మారి, లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు పోయాయి. కోట్లాదిమందిపై ప్రభావం పడింది. జూలై నెలలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారట. ఓ వైపు కరోనా మహమ్మారి కారణంగా రికవరీ ప్రారంభమైందని భావిస్తుంటే, మరోవైపు ఉద్యోగాలు కోల్పోవడం గమనార్హం. మొత్తంగా 18.9 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. జూలైలో 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) తెలిపింది. ఉద్యోగాల కోత రోజురోజుకు పెరగడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.

వరుసగా ఉద్యోగాల కోత..
CMIE డేటా ప్రకారం ఏప్రిల్ 2020లో 17.7 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మే నెలలో మరో 0.1 మిలియన్ల మంది ఉద్యోగం కోల్పోయారు. అదే సమయంలో జూన్ నెలలో మాత్రం 3.9 మంది కొత్తగా ఉద్యోగంలో చేరారు. మళ్లీ జూలై నెలలో 5 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి జూలై నాటికి వేతన ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. దీంతో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య 18.9 మిలియన్లకు పెరిగింది. రికవరీ ఆరోగ్యకరంగా లేదని, ఉద్యోగాలు ఉన్నవారి పరిస్థితి కూడా ఒత్తిడి, వేతనాల కోత వంటి వివిధ కారణాలతో ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.

21 శాతం ఉద్యోగాలు
మన దేశంలో వేతనరూపంలోని ఉపాధి 21శాతంగా ఉన్నట్లు అంచనా. ఇలాంటి ఉద్యోగాలకోత ఏప్రిల్ నాటికి 15శాతం పడిపోయాయి. వేతనజీవులు ఉద్యోగాలను అంత సులభంగా కోల్పోరని, కానీ ఓసారి పోయాయంటే అవి తిరిగి పొందడం అంత సులభం కాదని CMIE హెచ్చరించింది. 2019-20 ఆర్థిక సంవత్సరం కంటే శాలరైడ్ ఉద్యోగాలు 19 మిలియన్లు తక్కువగా ఉన్నట్లు తెలిపింది.

121 మిలియన్ల నుండి 11 మిలియన్లకు..
ఏప్రిల్ లాక్ డౌన్ సమయంలో 121.5 మిలియన్ ఉద్యోగాలు పోయాయని CMIE అంచనా వేసింది. మే నెలలో ఇది 100 మిలియన్లకు స్వల్పంగాతగ్గింది. జూన్ నెల నాటికి 29.9 మిలియన్లకు పడిపోగా, జూలైలో ఇది కేవలం 11 మిలియన్లుగా మాత్రమే ఉంది. అంటే ఏప్రిల్ నుండి జూలై నాటికి ఉద్యోగాలు దాదాపు రికవరీ అయ్యాయి. ఏప్రిల్ నెలలో 30 శాతం మంది ఉద్యోగాలు ఉపాధి కోల్పోగా, జూలైలో 3 శాతం కంటే తక్కువ కోల్పోయారు. 11 మిలియన్ల ఉద్యోగ నష్టాలు అంటే ఇది ఇప్పటికీ అందోళనకరమేనని చెబుతోంది CMIE.


Click it and Unblock the Notifications