ద్రవ్యలోటు 115% ఎక్కువ: కేంద్రానికి వచ్చిన రెవెన్యూ, రాష్ట్రాలకు ఎంతంటే?
భారత ద్రవ్యలోటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనా కంటే 114.8 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది నవంబర్ నాటికి రూ.8.07 లక్షల కోట్లుగా ఉందని మంగళవారం నాటి అధికారిక సమాచారం. ఖర్చులు, రెవెన్యూ మధ్య ఉన్న గ్యాప్‌ను ద్రవ్యలోటు (fiscal deficit)గా పేర్కొంటారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) ప్రకారం ఇది నవంబర్ 30, 2019 నాటికి రూ.8,07,834 వద్ద ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోను బడ్జెట్ అంచనాలో ద్రవ్యలోటు 114.8 శాతంగా ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు రూ.7.03 లక్షల కోట్లుగా బడ్జెట్‌లో ప్రభుత్వం అంచనా వేసింది.

కార్పోరేట్ ట్యాక్స్...
ఆర్థిక మందగమనం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గించింది. దీంతో ప్రభుత్వంపై రూ.1.45 లక్షల కోట్ల భారం పడింది. మందగమనంలో ఉన్న వివిధ రంగాలకు ఊతమిచ్చేందుకు, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. కేంద్రం ఓ వైపు చర్యలు తీసుకుంటుండగా జీడీపీ తొలి క్వార్టర్‌లో ఆరేళ్ల కనిష్టానికి 5 శాతానికి చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్‌లో 4.5 శాతానికి చేరుకుంది.

ఖర్చు తగ్గించుకోవాలని ఆదేశాలు
మరోవైపు, మందగమనం కారణంగా జీఎస్టీ కలెక్షన్లు కూడా తగ్గాయి. డిమాండ్, వినియోగం తగ్గింది. దీంతో ప్రజల్లో నగదు ఉంచేలా, తద్వారా వినిమయాన్ని పెంచేలా కేంద్రం చర్యలు ప్రారంభించింది. అన్ని ప్రభుత్వ శాఖలు కూడా తమ ఖర్చలను తగ్గించుకోవాలని, జనవరి - మార్చి మధ్య బడ్జెట్ అంచనా కంటే 25 శాతం తగ్గింపు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

వచ్చిన నిధులు... రాష్ట్రాలకు...
అఫీషియల్ స్టేట్‌మెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి నవంబర్ 2019 నాటికి వచ్చిన నిధులు రూ.10,12,223 కోట్లు. బడ్జెట్‌లో వేసిన అంచనాలో ఇది 48.60 శాతం. ఇందులో ట్యాక్స్ రెవెన్యూ ద్వారా రూ.7,50,614 కోట్లు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ.2,32,600 కోట్లు, నాన్ డెబిట్ కేపిటల్ రిసిప్ట్స్ రూ.29,009 కోట్లుగా ఉంది. నాన్ డెబిట్ కేపిటల్ రిసిప్ట్స్‌లో లోన్ రికవరీలు రూ.10,910 కోట్లు, డిస్ఇన్వెస్ట్‌మెంట్ ప్రొసీడ్స్ రూ.18,099 కోట్లు. ఇందులో రూ.4,21,850 కోట్లు రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాన్సుఫర్ అయ్యాయి.


Click it and Unblock the Notifications